ముంబై: స్మార్ట్ వాహన సేవల సంస్థ బౌన్స్ తమ విద్యుత్ వాహనాల చార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా 10 లక్షల పైచిలుకు బ్యాటరీలను స్వాప్ (మార్పిడి) చేసినట్లు వెల్లడించింది. దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి సంస్థ తమదేనని తెలిపింది.
ఇటీవల తమ ఈ–స్కూటర్ ఇన్ఫినిటీ ఈ1ను ఆవిష్కరించిన నేపథ్యంలో బ్యాటరీ–స్వాపింగ్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించింది. రేంజికి సంబంధించిన ఆందోళన తగ్గేలా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాటరీ–స్వాపింగ్, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఏఎస్) అత్యంత సమర్ధమంతమైన పరిష్కార మార్గాలని ప్రభుత్వం, విధానకర్తలు గుర్తించారని బౌన్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలకెరె తెలిపారు.
బ్యాటరీల మార్పిడి విధానంలో బౌన్స్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందని, దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ ఈ1 ఈ–స్కూటర్ దేశంలోనే తొలిసారిగా ’బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ ఆప్షన్‌తో లభిస్తుందని ఆయన చెప్పారు. బ్యాటరీతో కలిపి కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చని వివరించారు. స్కూటర్ నుంచి బ్యాటరీని తొలగించి కస్టమర్లు తమ ఇంటిలో లేదా ఆఫీసు లేదా మరెక్కడైనా చార్జింగ్ చేసుకునే వీలుంటుందని వివేకానంద వివరించారు. పెట్రోల్ బంకుల తరహాలోనే బౌన్స్ స్వాపింగ్ స్టేషన్లు పని చేస్తాయి. చార్జింగ్ ఆఖరు దశకు వచ్చిన బ్యాటరీలను ఈ స్టేషన్లలో పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలతో సులభంగా మార్చుకోవచ్చు. కస్టమర్లు తమ బ్యాటరీని చార్జింగ్ చేసుకునేందుకు సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment