మూడు టెల్కోలకు కోటి మంది దూరం
ట్రాయ్ సెప్టెంబర్ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 2024 సెప్టెంబర్‌లో కోటి మందికిపైగా వైర్‌లెస్ చందాదారులను కోల్పోయాయి. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సుమారు 8.5 లక్షల మంది కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్ మాసంలో రిలయన్స్ జియోకు 79.69 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్ 14.34 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు 15.53 లక్షల మంది దూరమయ్యారు.
సెప్టెంబర్ చివరినాటికి మొత్తం వైర్‌లెస్ చందాదార్ల సంఖ్య 0.87 శాతం పడిపోయి 115.37 కోట్లకు వచ్చి చేరింది. ఇందులో రిలయన్స్ జియోకు 46.37 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా 21.24 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 9.18 కోట్ల మంది ఉన్నారు. వైర్‌లెస్ వినియోగదార్లు నగరాల్లో 0.80 శాతం, గ్రామాల్లో 0.95 శాతం తగ్గారు. వైర్డ్, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ చందాదార్ల సంఖ్య 0.51% క్షీణించి 94.44 కోట్లు నమోదైంది. ఇందులో రిలయన్స్ జియోకు 47.7 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ 28.5 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.6 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 3.7 కోట్ల మంది ఉన్నారు.
మార్కెట్ వాటా పొందేందుకు..
జూలైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదలని ఉండబోదని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గత నెలలో స్పష్టం చేయడం గమనార్హం. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్‌్క, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment