ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్‌ విద్యార్థి! | BTech Student Incurred Substantial Losses Through F&O Trading Around Rs 46 Lakhs | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్‌ విద్యార్థి!

Published Wed, Jun 26 2024 11:29 AM | Last Updated on Wed, Jun 26 2024 1:09 PM

BTech student incurred substantial losses through F&O trading arround Rs 46 lakhs

స్టాక్‌మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాకే ఇన్వెస్ట్‌ చేయాలని ఆర్థిక నిపుణులు, సెబీ హెచ్చరిస్తున్నా వారి సూచనలు పట్టించుకోకుండా చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌ నిపుణుల సలహాలు పట్టించుకోని ఓ బీటెక్‌ విద్యార్థి రెండేళ్లలో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ చేసి ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఆ విద్యార్థి రోషన్‌ అగర్వాల​్‌ అనే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

రోషన్‌ తెలిపిన వివరాల ప్రకారం..‘బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయాలని నా వద్దకు వచ్చాడు. తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి హోటల్‌ నిర్వహిస్తోంది. పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్ల అకౌంట్‌ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఆ డబ్బుతో ట్రేడింగ్‌ చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు నష్టపోవడంతో యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ట్రేడింగ్‌ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్‌ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్‌ అండ్‌ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’ అని చెప్పారు.

‘ఆ విద్యార్థి మిత్రుడు ఒకరు ఎఫ్‌ అండ్‌ ఓ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం నష్టం వస్తునపుడు ఆ ట్రేడింగ్‌ను మానేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే..ట్రేడింగ్‌కు బానిసైపోయా అని బదులిచ్చాడు. ఇంతలా నష్టపోయావు కదా.. భవిష్యత్తులో మళ్లీ ట్రేడింగ్‌ చేస్తావా? అని అడిగితే ఇకపై ట్రేడింగ్‌ చేయనని చెప్పాడు’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇదీ  చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ఇవి గమనిస్తే మేలు

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ అన్నారు. ‘ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ చేస్తున్న దాదాపు 45.24 లక్షల మందిలో, కేవలం 11 శాతం మందే లాభాలు పొందుతున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు పొందవచ్చు. సంపద సృష్టికి అవకాశం ఉన్న విభాగంలోనే పెట్టుబడులు పెట్టండి’ అని ఆమె గతంలో మదుపర్లకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement