పసిడి..వెండి.. ఊరట! | Budget 2024: Big changes to Customs Duty announced | Sakshi
Sakshi News home page

పసిడి..వెండి.. ఊరట!

Published Wed, Jul 24 2024 2:36 AM | Last Updated on Wed, Jul 24 2024 8:03 AM

Budget 2024: Big changes to Customs Duty announced

కస్టమ్స్‌ సుంకం భారీగా తగ్గింపు

15 నుంచి 6 శాతానికి కోత  

రూ. 3000 పైగా దిగొచ్చిన ధరలు

న్యూఢిల్లీ: ఇటు బులియన్‌ పరిశ్రమకు అటు ఆభరణాల ప్రియులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది.

ఇక విలువైన లోహాల నాణేలు, హుక్, క్లాస్ప్, క్లాంప్, పిన్, క్యాచ్, స్క్రూ బ్యాక్‌ వంటి చిన్న భాగాలకు సంబంధించిన బంగారం–వెండి ఫైండింగ్స్, బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని కూడా 15 శాతం నుంచి 6 శాతానికి బడ్జెట్‌ తగ్గించింది. మరింత మెరుగుదల అవసరమైన బంగారం, వెండి డోర్‌లపై కస్టమ్స్‌ సుంకం 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు.

 ‘‘దేశంలో బంగారం, విలువైన లోహ ఆభరణాల పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి బంగారం– వెండిపై కస్టమ్స్‌ సుంకాలను 6 శాతానికి  తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం 
నుంచి 6.4 శాతానికి బడ్జెట్‌లో తగ్గించారు.

రాజధానిలో రూ.3,350 తగ్గుదల 
ఇక ఆర్థిక మంత్రి కీలక ప్రకటన నేపథ్యంలో స్పాట్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పడ్డాయి.  దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత (99.9 శాతం ప్యూరిటీ) పసిడి ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,350 తగ్గి, రూ.72,300కు దిగివచి్చంది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో దిగివచ్చి రూ.71,950 స్థాయికి చేరింది.

వెండి కేజీ ధర  సైతం రూ.3,500 (4 శాతం) తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే, 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,614 రూ.3,602 చొప్పున తగ్గి వరుసగా రూ.69,602, రూ.69,323కు దిగివచ్చాయి. ఇక వెండి కేజీ ధర రూ.3,275 తగ్గి రూ.84,919కి దిగింది.  

ఫ్యూచర్స్‌లో రూ.4,000 డౌన్‌ 
ఆర్థికమంత్రి ప్రకటన వెంటనే ఫ్యూచర్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో చురుగ్గా ట్రేడవుతున్న బంగారం ఆగస్టు కాంట్రాక్ట్‌ 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోలి్చతే దాదాపు రూ.4,000 పడిపోయి (5 శాతంపైగా) రూ.68,500కు చేరింది. కేజీ వెండి ధర సైతం రూ.88,995 నుంచి రూ.84,275కు దిగివచి్చంది. 

అంతర్జాతీయంగా ధర ఇలా... 
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఈ నెల 16వ తేదీన   ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్‌ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్‌ ధర మంగళవారం 2,400 డాలర్లపైన ట్రేడవుతోంది.  

తీపికబురే కానీ... 
కస్టమ్స్‌ సుంకాలు తగ్గించడం  తక్షణ డిమాండ్‌కు సంబంధించి బులియన్‌ పరిశ్రమ,  వినియోగదారుకు తీపి కబురే అయినప్పటికీ ఈ నిర్ణయంపై రానున్న కాలంలో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువల కదలికలు ప్రభావం చూపుతాయి.

డిజిటల్‌ పెట్టుబడికి అవకాశం
కస్టమ్స్‌ సుంకం తగ్గింపు బులియన్‌ మార్కెట్‌ను తక్షణం ప్రభావితం చేసే అంశమే. ఇది పెట్టుబడిదారులకు సానుకూల చర్య అయినప్పటికీ, చైనాసహా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు.  2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ వంటి డిజిటల్‌ ఆప్షన్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం.  – మహేంద్ర లూనియా, విఘ్నహర్తా గోల్డ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement