సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్, ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు వంటి వైట్ గూడ్స్ తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం వర్తింపచేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 6,238 కోట్లు వెచ్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు పీఎల్‌ఐ పథకంపరమైన ప్రోత్సాహకాలు దోహదపడనున్నాయి. దీని ద్వారా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది.
వైట్ గూడ్స్ పీఎల్‌ఐ స్కీమ్ ప్రకారం దేశీయంగా ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు తయారు చేసే కంపెనీలకు అయిదేళ్లపాటు విక్రయాలపై 4 నుంచి 6 శాతం దాకా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో తగినంత స్థాయిలో ఉత్పత్తి లేనటువంటి ఉత్పాదనల తయారీని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఫినిష్డ్ గూడ్స్‌ను అసెంబ్లింగ్ మాత్రమే చేసే సంస్థలకు ఇది వర్తించదు. కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న ఐదేళ్ల కాలంలో పీఎల్‌ఐ పథకం వల్ల రూ. 7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ .64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష–పరోక్ష మార్గాల్లో రూ. 49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది కేంద్రం అంచనా.
సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి ..
అధిక సామర్థ్యం కలిగిన గిగా వాట్ స్థాయి సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యుల్స్’ పేరుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం వర్తింపజేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 4,500 కోట్లు ప్రోత్సాహకాలుగా వెచ్చించనుంది. దేశీయ పరిశ్రమలో సోలార్ పీవీ మాడ్యుల్స్ నిర్వహణ సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీటి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల దేశీయంగా సామర్థ్యం పెంపు కోసం పీఎల్‌ఐ స్కీమ్ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment