సిమెంటుకు పెరగనున్న డిమాండ్‌  | Cement Demand Expected to Grow 7-8pc in fy23: Icra | Sakshi
Sakshi News home page

సిమెంటుకు పెరగనున్న డిమాండ్‌ 

Published Thu, Apr 21 2022 10:09 AM | Last Updated on Thu, Apr 21 2022 10:10 AM

Cement Demand Expected to Grow 7-8pc in fy23: Icra - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  సిమెంట్‌ డిమాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 2022–23లో సిమెంట్‌ అమ్మకాలు దాదాపు 382 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాల నుండి బలమైన డిమాండ్‌ ఇందుకు కారణం.

అధిక తయారీ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా పరిశ్రమకు నిర్వహణ లాభం 270–320 బేసిస్‌ పాయింట్స్‌ తగ్గి 16.8–17.3 శాతం నమోదు కావొచ్చు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఫిబ్రవరి కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 323 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. తుఫాన్లు, అకాల వర్షాలతో 2021 నవంబర్‌లో సిమెంట్‌ డిమాండ్‌ పడిపోయింది. డిసెంబర్‌ నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. 2021–22లో ఉత్పత్తి 18–20 శాతం అధికమై కోవిడ్‌–19 ముందస్తు స్థాయి 355 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులని అంచనా’ అని ఇక్రా వివరించింది.

వ్యవసాయం, అందుబాటు ధర గృహాలు, మూలధన వ్యయం కోసం ఇటీవల బడ్జెట్‌లో రూ.9.2 లక్షల కోట్ల కేటాయింపులు జరగడం సిమెంట్‌ డిమాండ్‌కు ఊతమిస్తుందని ఇక్రా ఏవీపీ, సిమెంట్‌ విభాగం హెడ్‌ అనుపమ రెడ్డి తెలిపారు. సిమెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 545 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. సిమెంట్‌ తయారీలో చైనా తర్వాత ప్రపంచంలో భారత్‌ రెండవ స్థానంలో ఉంది.   

చదవండి: ఆల్‌టైమ్‌ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement