ఇప్పటికే పెరిగి పోతున్న పెట్రోల్, డీజిల్, వంటనూనె, ఉల్లిపాయ ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. వచ్చేవారం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సారి అంతా.. ఇంతా కాదు ఏకంగా రూ.100 వరకు పెరగొచ్చని కొన్ని వర్గాలు సామాన్య ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. కేంద్రం అనుమతిస్తే ధరల పెంపు ఉండే అవకాశం ఉంది అని సమాచారం. అదే జరిగితే అన్ని కేటగిరీల్లో వంట గ్యాస్ రేట్లు పెరగడం ఇది ఐదవ సారి.
అక్టోబర్ 6న 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ఎల్‌పీజీ ధర రూ.950కి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది. కేవలం జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.90కి పెరిగింది. ఎల్‌పీజీపై గత ఏడాది నుంచి కేంద్రం రాయితీలను ఎత్తివేసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, ధరలు పెరుగుదలకు అమ్మకాలకు మధ్య ఉన్న అంతరాన్ని భరించేందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. (చదవండి: మార్కెట్లోకి శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో.. ధర ఎంతో తెలుసా?)
అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్టా స్థాయికి పెరగడంతో ఎల్‌పీజీ అమ్మకాలపై నష్టాలు సిలిండర్‌కు రూ.100కు పైగా పెరిగినట్లు వారు తెలిపారు. సౌదీ ఎల్‌పీజీ రేట్లు ఈ నెలలో టన్నుకు 60 శాతం పెరిగి 800 డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 85.42 అమెరికన్ డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాయితీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో చమరు కంపెనీలు ఆ భారాన్ని మేయలని పేర్కొంటున్నాయి. లేకపోతే, ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దం అవుతున్నాయి. గతంలో సిలిండర్‌పై కేంద్రం మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ సరిపెడుతోంది. దాంతో, ఇంట్లో గ్యాస్ ముట్టించాలంటేనే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment