న్యూఢిల్లీ: దేశీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ’కూ’ యాప్ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై తన వాటాలను విక్రయించి వైదొలిగే పనిలో ఉంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి పోటీగా తెరపైకి వచ్చిన ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ఈ విషయం తెలిపారు. కూ యాప్ మాతృసంస్థ బాంబినేట్ గతంలో తయారు చేసిన వోకల్ యాప్ కోసం షున్‌వై క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత బాంబినేట్ సంస్థ ప్రధానంగా ఇండియన్ ట్విటర్ "కూ" యాప్ పై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో షున్‌వై తప్పుకుంటోంది. ఆ సంస్థకున్న 9 శాతం వాటాలను దేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నట్లు రాధాకృష్ణ తెలిపారు.
‘2018లో ప్రశ్నోత్తరాల యాప్ వోకల్‌ను మేం ప్రారంభించినప్పడు.. కంటెంట్ రంగంలో ప్రముఖ ఇన్వెస్టరయిన చైన సంస్థ షున్‌వై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పలు కంపెనీల్లో షున్‌వై ఇన్వెస్ట్ చేసిందని, బాంబినేట్ కూడా అందులో ఒకటని వివరించారు. అప్పట్లో ‘కూ’ ని రూపొందించలేదని చెప్పారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కూ ప్రారంభించామని, పూర్తి దేశీ యాప్‌గా జాతీయ స్థాయిలో దీనికి ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదని రాధాకృష్ణ చెప్పారు. 3వన్4 క్యాపిటల్, యాక్సెల్ పార్ట్‌నర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి బాంబినేట్ ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించింది. పూర్తి స్వదేశీ యాప్‌గా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కొత్తగా మరే చైనా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం లేదని రాధాకృష్ణ వివరించారు. తెలుగు, హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంటోంది. ఇటీవలే 30 లక్షల డౌన్‌లోడ్లు దాటగా, పది లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
చదవండి:
‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్!
Comments
Please login to add a commentAdd a comment