Global Investors Summit: AP attracts Rs 13 lakh crore investment proposals - Sakshi
Sakshi News home page

GIS 2023: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం జగన్‌

Published Fri, Mar 3 2023 2:00 PM | Last Updated on Sat, Mar 4 2023 9:25 AM

Cm Ys Jagan Said Ap Has Potential To Be One Of The Leadding State In India   - Sakshi

విశాఖ జీఐఎస్‌ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు అనూహ్య స్పందన లభించింది. విశాఖ వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల జీఐఎస్‌ సదస్సు సందర్భంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 340 ఒప్పందాలు రానున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

వీటి ద్వారా 3,92,015 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క ఇంధన రంగంలోనే రూ.8,25,639 కోట్ల విలువైన 35 ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ, ఏబీసీ, ఇండోసోల్, జేఎస్‌­డబ్ల్యూ గ్రూపు, ఏసీఎంఈ, టెప్‌సోల్, అవాడా, గ్రీన్‌కో, అదానీ, అరబిందో, ఎన్‌హెచ్‌పీసీ, ఆదిత్య బిర్లా వంటి సంస్థలున్నాయి. ఇంధన రంగంలో పెట్టుబడుల ద్వారా 1,33,950 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమలు.. వాణిజ్య విభాగంలో రూ.3,20,455 కోట్ల విలువైన 41 ఒప్పందాలు కుదిరాయి.

వీటి ద్వారా 1,79,850 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో జిందాల్‌ స్టీల్,  శ్రీ సిమెంట్, మైహోమ్‌ సిమెంట్, అల్ట్రాటెక్, లారస్‌ మోండలెజ్, వెల్సపన్‌ వంటి సంస్థలున్నాయి. ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో రూ.32,944 కోట్ల విలువైన 6 ఒప్పందాలు కుదరగా, వీటి ద్వారా 64,815 మౖందికి ఉపాధి లభించనుంది. ఇందులో టీసీఎల్, రిజల్యూట్, డైకిన్, సన్నీ ఆప్టెక్‌ వంటి సంస్థలున్నాయి.

పర్యాటక రంగంలో రూ.8,718 కోట్ల విలువైన 10 ఒప్పందాలు కుదరగా.. వీటి ద్వారా 13,400 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో డ్రీమ్‌వ్యాలీ గ్రూపు, ఒబెరాయ్, భ్రమరాంభ గ్రూపు, ఎంఆర్‌కేఆర్, మంజీరా హోటల్స్‌ వంటి సంస్థలున్నాయి. రెండవ రోజు శనివారం రూ.1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు కుదరనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ మాటామంతి   

రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడిన కార్పొరేట్‌ దిగ్గజాలు
కోవిడ్‌ తర్వాత తక్కువ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు పెట్టించి, రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్‌షోలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. జీఐఎస్‌ సమావేశంలో పాల్గొన్న అంబానీ దగ్గర నుంచి బంగర్‌ వరకు అందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను స్వాగతిస్తూ ప్రసంగించారు.

ముఖ్యంగా విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడారు. సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి వచ్చిన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సభ ముగేసే వరకు.. ఆద్యంతం ముఖ్యమంత్రితో చర్చిస్తూ ఉల్లాసంగా కనిపించారు. సీఎం తన ప్రసంగం అనంతరం వేదికపై ఉన్న ప్రతి పారిశ్రామికవేత్త వద్దకు వెళ్లి నమస్కరించి పలకరించారు. ఎంవోయూ కార్యక్రమం అనంతరం పారిశ్రామికవేత్తలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన సమయంలో పాదరక్షలు విడిచిన పారిశ్రామికవేత్తలు.. తర్వాత నిలబడి వాటిని ధరించడంలో ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రి వారికి ఆసరాగా నిలిచి చేయూతనందించడం పలువురిని ఆకర్షించింది. మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాల్స్‌ను సందర్శించారు. అంతకు ముందు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై నాలుగు ఆడియో విజువల్స్‌ ప్రదర్శించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జీఐఎస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి. ఎయిర్‌పోర్టులో అతిథులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహ్వానం పలికిన విధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని పలువురు వక్తలు సదస్సులో ప్రస్తావించారు.

సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర జానపద కళలు, కొమ్మునృత్యం, తప్పటగుళ్లు, ఉరుములు అందరినీ ఆకర్షించాయి. ఈ సదస్సుకు కార్పొరేట్‌ ప్రముఖలతో పాటు, విదేశీ రాయబారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సమావేశాలకు హాజరైన వారికి ముఖ్యమంత్రి రాత్రి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. 

భారీ పెట్టుబడులు పెడుతున్నాం  
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ సుస్థిర సమగ్రాభివృద్ధిని సాధిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. ఏపీలో మరింతగా విస్తరించనున్నాం. 
– కరణ్‌ అదానీ, సీఈవో, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌

 

విజనరీ ముఖ్యమంత్రి
విజనరీ లీడర్‌ షిప్‌తో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న సీఎం జగన్‌కు కృత­జ్ఞతలు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే పనిచేస్తున్నాం. పలు ప్రాజె­క్టులకు ఎంవోయూలు చేసుకున్నాం. 
– నవీన్‌ జిందాల్, జేఎస్‌పీఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌

జగన్‌ సారథ్యంలో వేగంగా అభివృద్ధి 
భోగాపురం ఎయిర్‌పోర్టు సిటీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుంది. తొలి దశలో రూ.5,000 కోట్లతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 
– జీఎం రావు, జీఎంఆర్‌ గ్రూపు చైర్మన్‌ 

పరిశ్రమలు తరలి వస్తున్నాయి
వైద్య, ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్‌ భాగస్వామిగా ఉండటం 
సంతోషంగా ఉంది. ఏపీవైపు అన్ని పరిశ్రమలు తరలి వస్తున్నాయి.  
– ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వైస్‌ చైర్‌పర్సన్‌  

అపార అవకాశాలు.. 
ఫార్మా రంగంలో ముడి పదార్థాలకు చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో తయారీ పార్క్‌ను నెలకొల్పాలని కోరుతున్నా. యానిమల్, ఆక్వా వ్యాక్సినేషన్ల రంగా­ల్లోనూ అపార అవకాశాలున్నాయి. 
– కృష్ణ ఎల్లా, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement