న్యూఢిల్లీ: అమెరికాతో కలసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతానికి నూతన వాణిజ్య ఒప్పందాల కోసం తాము చూడడం లేదని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎగుమతిదారుల సమావేశంలో భాగంగా మంత్రి స్పందించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకు గాను మరిన్ని మార్కెట్ అవకాశాల కల్పన కోసం కలసి పనిచేయాలనుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘నూతన వాణిజ్య ఒప్పందాల కోసం చూడడం లేదని అమెరికా చెప్పింది. కానీ మరిన్ని మార్కెట్ అవకాశాల కల్పనకు (ఒకరి మార్కెట్లోకి మరొకరికి అవకాశాలు కల్పించడం) వారితో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాం. అది పెద్ద ఉపశమనమే కాదు.. భారత ఎగుమతి రంగానికి పెద్ద అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది’’ అని గోయల్ చెప్పారు. భారత్‌తో సానుకూల ఒప్పందాన్ని ముందుగానే కుదుర్చుకునేందుకు ఆస్ట్రేలియా ఎంతో ఆసక్తి వ్యక్తీకరించినట్టు మంత్రి తెలిపారు. ఏ విభాగాల పట్ల ఆసక్తిగా ఉన్నదీ ఎగుమతిదారులు వాణిజ్య శాఖతో పంచుకోవాలని సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలతో ముందస్తు సామరస్య ఒప్పందాల మద్దతుతో ఇతర దేశాలతోనూ భారత్ ఇదే మాదిరి కలసి పనిచేసే సానుకూలత ఏర్పడుతుందన్నారు.
ఇతర దేశాలతోనూ ఒప్పందాలు..
బ్రిటన్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల బృందాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు మంత్రి వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయని.. ఒప్పందానికి చాలా సమయమే పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కానీయబోమని ఎగుమతిదారులకు అభయమిచ్చారు. అందరి సంప్రదింపుల మీదట మెరుగైన ఒప్పందాలను చేసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్‌తోనూ ఒప్పందానికి చర్చలు మొదలుపెట్టినట్టు తెలిపారు. భారీ అవకాశాలున్న దేశాల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. దేశం నుంచి ఎగుమతులు వేగాన్ని అందుకున్నాయని.. ఆగస్ట్‌లో మొదటి రెండు వారాల్లో 55 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు.
వాణిజ్య ఒప్పందాలపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ‍్యలు
Published Sat, Aug 21 2021 8:10 AM | Last Updated on Sat, Aug 21 2021 8:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment