
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాను (వీఐఎల్) గట్టెక్కించడానికి కసరత్తు కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ బకాయిలను చెల్లించే విషయంలో టెలికం రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు టెలికం శాఖ (డాట్) బ్యాంకుల సీనియర్ అధికారులతో సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా వీఐఎల్ అంశం కూడా చర్చకు వచి్చంది. కంపెనీకి ఇచ్చిన రుణాలను ఈక్విటీల కింద మార్చుకోవడం ద్వారా దాన్ని బైటపడేసేందుకు ఒక మార్గం ఉందని డాట్‌కు బ్యాంకర్లు తెలియజేశారు. గతంలోనూ ఒత్తిడిలో ఉన్న కొన్ని సంస్థల విషయంలో ఇలాంటి విధానం అనుసరించిన సంగతి వివరించారు. అయితే, వీఐఎల్ ఇప్పటిదాకా రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కానందున తాము చర్యలు తీసుకోలేమని బ్యాంకుల అధికారులు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వీఐఎల్ గానీ మూతబడితే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు నష్టం వాటిల్లుతుందని అంచనా. కంపెనీకి రుణాలిచి్చన వాటిల్లో ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకులే ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై గణనీయంగా ప్రభావం పడే అవకాశముంది. దీంతో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే మొండి బాకీ కింద ప్రొవిజనింగ్ చేయడం మొదలుపెట్టాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల కింద కేంద్రానికి వీఐఎల్ రూ.58,254 కోట్లు కట్టాలి. ఇందులో రూ.7,854 కోట్లు కట్టగా రూ.50,400 కోట్లు బాకీ పడింది. టెలికం సంస్థలు కేంద్రానికి రూ. 93,350 కోట్ల మేర ఏజీఆర్ బాకీలు కట్టాల్సి ఉంది. టెలికం రంగంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇందుకు సుప్రీం కోర్టు పదేళ్ల గడువు ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment