వెబ్ స్పెషల్ : తక్కువ పనిగంటలు..ఎక్కువ ఉత్పాదకత అంటూ ఫిన్లాండ్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటే, ఆడుతూ..పాడుతూ ఉల్లాసంగా పనిచేస్తేనే ఉత్పాదకత మెరుగవుతుందని పలు దేశాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వారానికి నాలుగు రోజుల పనిదినాల వైపు యూరప్‌లో అడుగులు పడుతున్న వేళ మళ్లీ ఉద్యోగుల పనిదినాలు, పనిసంస్కృతి, ఇంటి నుంచే పనిపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. అసలు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంతో ఉరకలు వేయాలంటే కీలకమైన ఉపాథి, ఉత్పాదకతకు ఊతమివ్వాలి. మెరుగైన పని సంస్కృతే నాణ్యమైన ఉత్పాదకతకు బాటలువేస్తుందని పలు అథ్యయనాలు, పరిశోధనల్లో స్పష్టమవగా తాజాగా కరోనా వైరస్‌తో పని స్వభావమే సమూల మార్పులకు లోనవుతోంది.
కోవిడ్-19తో ప్రపంచం వణికిపోతున్న క్రమంలో కోట్లాది ఉద్యోగాలు ఏకంగా డ్రాయింగ్ రూమ్‌లకే చేరాయి. ఆన్‌లైన్‌లోనే ఉద్యోగులు పనులను చక్కబెడుతుండగా గతంలో పరిమిత ఉద్యోగులకే అందుబాటులో ఉన్న ‘ఇంటి నుంచే పని’ ఇప్పుడు అధిక శాతం ఉద్యోగులకు అందివచ్చింది. కరోనా వైరస్ కట్టడికి మార్చి నెలాఖరు నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలవడంతో ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే విధానానికి సంస్థలు అనివార్యంగా ఓటేశాయి. వర్క్ ఫ్రం హోంకి సంస్థలు మొగ్గుచూపడంతో ఈ తరహా జాబ్‌లిస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్టు నౌకరీ.కాం నివేదిక పేర్కొంది. చదవండి : ‘ఆస్ట్రాజెనెకా’ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన
ఉద్యోగులిలా..ఉన్నతాధికారులిలా..!
ఇంటి నుంచి పని పద్ధతిపై అక్కడక్కడా కొన్ని ఫిర్యాదులు, అసంతృప్తులున్నా స్ధూలంగా ఉత్పాదకత మెరుగైనట్టు వెల్లడైంది. బాసులు తమపై ఒత్తిళ్లు పెంచారని, టార్గెట్లతో వేధించారని, జీతాల్లో కోత విధించారని ఉద్యోగులు వాపోతే..ఇంటర్నెట్ పనిచేయడం లేదని, పవర్ లేదంటూ ఉద్యోగులు తప్పించుకుని తిరిగారని ఉన్నతాధికారులు తలపట్టుకున్నట్టు మరికొన్ని సర్వేలు చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో అత్యధికంగా ఇంటి నుంచి పని పద్ధతిని ఉద్యోగులు, సంస్ధలు అనుసరిస్తుండటంతో ఐటీ సేవల పరంగా ఉత్పాదకత పరంగా ఏమాత్రం ప్రతికూల ప్రభావం పడలేదని నిపుణులు వెల్లడించారు.
మరో సర్వే సైతం ఇంటి నుంచి పని మెరుగైన ఫలితాలనే రాబట్టిందని వెల్లడైంది. ఇంటి నుంచి పని చేయటానికి ఒత్తిడికి గురి కాలేదని 62 శాతం అభిప్రాయపడగా.. వర్క్ ఫ్రం హోంలో భాగంగా రోజులో 12 గంటల కంటే ఎక్కవగా పని చేశామని 8.3 శాతం మంది చెప్పుకొస్తే. 8 నుంచి పది గంటలు పని చేశామని 48.9 శాతం తెలిపారు. రోజుకు ఏకంగా పది నుంచి పన్నెండు గంటల పాటు పనిచేశామని 28.1 శాతం మంది చెప్పారంటే ఉత్పాదకత ఏమాత్రం తగ్గకపోగా మరింత ఇనుమడించినట్టు వెల్లడైంది. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితాన్నీ మెరుగ్గా ఆస్వాదిస్తున్నామని ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి పనివిధానం పలు రంగాల్లో కొనసాగే అవకాశం ఉంది. రిమోట్ వర్కింగ్ అంటూ పలు సంస్ధలు ఈ పద్ధతికి ఓటేస్తున్నాయి.
తక్కువ పనిగంటలే మేలు
యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో పలు స్టార్టప్‌లు వారానికి నాలుగు పనిదినాలనే ఉద్యోగులకు ఆఫర్ చేస్తూ మెరుగైన ఉత్పాదకత సాధిస్తున్నాయి. గతంలో మైక్రోసాఫ్ట్‌్ సైతం వారానికి నాలుగురోజుల పనివిధానంలో ఉత్పాదకత 40 శాతం పెరిగినట్టు గుర్తించింది. బ్రిటన్‌లో నాలుగు రోజుల పనిదినాలు కలిగిన మూడోవంతు వాణిజ్య సంస్థల్లో ఉత్పాదకత మెరుగైందని హెన్లీ బిజినెస్ స్కూల్ చేపట్టిన పరిశోధన వెల్లడించింది.
ఈ పద్ధతితో ఉద్యోగులు నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించారని వారిలో సంతోషం వెల్లివిరియడంతో పాటు తక్కువగా ఒత్తిడికి , అనారోగ్యానికి గురయ్యారని వెల్లడైంది. నాలుగు రోజుల పనివిధానంతో సిబ్బంది, కార్యాలయాలపై వెచ్చించే ఖర్చు భారీగా తగ్గడంతో పాటు మౌలిక వసతులు, ఇతర వ్యయాలూ తగ్గి ఉద్యోగాల కోతను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికి నాలుగు రోజుల పని అన్ని సంస్ధలకూ మెరుగైన ఫలితాలనే రాబట్టలేదని, ఉత్పాదకత పడిపోతుందని మరికొన్ని సంస్ధలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పని పద్ధతులపై ఆసక్తికర చర్చకు తెరలేచింది.
Comments
Please login to add a commentAdd a comment