
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు..
"విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్‌లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు.
"వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్ గేట్స్ సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment