
Crosstower Offers Indian Users 5000 Credit For Learning Crypto Trading: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం ఊపందుకుంది. అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌లో కూడా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం బ్రోకర్‌చూసర్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 10 కోట్లకుపైగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. భారత్‌లో పలు క్రిప్టో ట్రేడింగ్ కంపెనీలు కూడా క్రిప్టోపై అవగాహనను కల్పించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి.
జియో ఫ్రీ ఆఫర్ తరహాలో..!
టెలికాం రంగంలో జియో రాకతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో ప్రారంభంలో సుమారు ఆర్నెల్ల పాటు ఉచిత డేటా, కాలింగ్‌ను అందించిన విషయం మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు జియో తరహాలో క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్‌ను ప్రొత్సహించేందుకుగాను క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ క్రాస్‌టవర్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. క్రాస్‌టవర్‌తో క్రిప్టో ట్రేడింగ్ ప్రారంభించే యూజర్లకు ఉచితంగా రూ. 5 వేలను వారి వ్యాలెట్‌లో క్రెడిట్ చేయనుంది.
ఆయా యూజర్ కేవైసీ పూర్తికాగానే రూ. 5 వేలు వ్యాలెట్‌లోకి వస్తాయి. కంపెనీ ప్రకారం..వీటితో వచ్చే లాభాలను యూజర్లు సులువుగా రిడీమ్ చేసుకోవచ్చును. ట్రేడింగ్ చేసే సమయంలో వచ్చే నష్టాలను కంపెనీ భరిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఇతర వ్యాలెట్లకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతి ఉండదు. ఈ ఫీచర్‌తో భారత యూజర్లు ఎలాంటి ఖర్చు లేకుండా క్రిప్టో ట్రేడింగ్‌లో పాల్గొనే సామర్థ్యాన్ని పొందుతారని క్రాస్‌టవర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ అహుజా అభిప్రాయపడ్డారు.
చదవండి: వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్
సరికొత్త పంథాతో ట్రేడింగ్ కంపెనీలు..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై మరింత ఆదరణను తెచ్చేందుకు పలు క్రిప్టోట్రేడింగ్ కంపెనీలు సరికొత్త పంథాలో వెళ్తున్నాయి. క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహనను తెచ్చేందుకుగాను పలు ట్రేడింగ్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ప్రముఖ నటులను నియమించుకుంటున్నారు. కొద్ది రోజల క్రితం కాయిన్‌స్విచ్చ్‌కుబేర్‌కు రణ్‌వీర్ సింగ్‌ను, కాయిన్‌డీసీఎక్స్‌కు ఆయుష్మాన్ ఖురానాను నియమించిన విషయం తెలిసిందే. వీరిని ప్రచారకర్తలుగా నియమాకంతో భారత్‌లోని టైర్-1, టైర్-2 నగరాలోని ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహనను కల్పించేందుకు క్రిప్టోకంపెనీలు సిద్ధమయ్యాయి.
చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...!