న్యూయార్క్: సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 అమెరికా, యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పతన బాటలో సాగిన ముడిచమురు ధరలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 44 డాలర్లను దాటేయగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 42 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం నైమెక్స్ బ్యారల్ 1.3 శాతం బలపడి 41.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లకు చేరింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టనుండటం, వ్యాక్సిన్‌పై అంచనాలు వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు సైతం చమురు ధరలు దాదాపు 3 శాతం చొప్పున జంప్‌చేశాయి. బ్రెంట్ 1.2 డాలర్లు పెరిగి 43.61 డాలర్ల వద్ద నిలవగా.. నైమెక్స్ బ్యారల్ 1 డాలరు పుంజుకుని 41.36 డాలర్ల వద్ద స్థిరపడింది.
కారణాలివీ
నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ మంగళవారం వెల్లడించింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం! దీనికితోడు తాజాగా అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం ద్వారా తిరిగి చమురుకు డిమాండ్ పుంజుకోనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ సానుకూల వార్తలు చమురు ధరలకు జోష్‌నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment