brent crude
-
మళ్లీ మండుతున్న చమురు ధరలు
న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ మార్కెట్లలో మళ్లీ ముడిచమురు ధరలు మండుతున్నాయి. మంగళవారం దాదాపు 5 శాతం జంప్‌చేసిన ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.2 శాతం పుంజుకుని 50 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.6 శాతం ఎగసి 53.94 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్) ఏం జరిగిందంటే? అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు మద్దతుగా ఒపెక్సహా రష్యావరకూ మూడేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 సంక్షోభం వంటి పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ధరలకు నిలకడను తీసుకువచ్చేందుకు చమురు ఉత్పత్తి, ఎగుమతుల దేశాలు ప్రయత్రిస్తున్నాయి. ఈ బాటలో 2017 జనవరి నుంచి చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా రెండు రోజులపాటు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా అదనపు కోతలకు సిద్ధమని తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) రోజుకి 10 లక్షల బ్యారళ్లు కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ చమురు ధరల సెగ
న్యూయార్క్: సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 అమెరికా, యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పతన బాటలో సాగిన ముడిచమురు ధరలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 44 డాలర్లను దాటేయగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 42 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం నైమెక్స్ బ్యారల్ 1.3 శాతం బలపడి 41.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లకు చేరింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టనుండటం, వ్యాక్సిన్‌పై అంచనాలు వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు సైతం చమురు ధరలు దాదాపు 3 శాతం చొప్పున జంప్‌చేశాయి. బ్రెంట్ 1.2 డాలర్లు పెరిగి 43.61 డాలర్ల వద్ద నిలవగా.. నైమెక్స్ బ్యారల్ 1 డాలరు పుంజుకుని 41.36 డాలర్ల వద్ద స్థిరపడింది. కారణాలివీ నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం వెల్లడించింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం! దీనికితోడు తాజాగా అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం ద్వారా తిరిగి చమురుకు డిమాండ్ పుంజుకోనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ సానుకూల వార్తలు చమురు ధరలకు జోష్‌నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
లాక్డౌన్ల షాక్- జారుతున్న చమురు
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఫలితంగా అక్టోబర్‌లో నైమెక్స్ చమురు ధరలు నికరంగా 11 శాతం పతనంకాగా.. బ్రెంట్ బ్యారల్ ధరలు సైతం 10 శాతం వెనకడుగు వేశాయి. ఈ బాటలో మరోసారి చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు వెల్తువెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం.. 3.5 శాతం డౌన్ గత వారం భారీగా వెనకడుగు వేసిన ముడిచమురు ధరలు మళ్లీ పతన బాట పట్టాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 3.7 శాతం నష్టంతో 34.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3.25 శాతం క్షీణించి 36.72 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. కారణాలివీ కొద్ది రోజులుగా అమెరికాలో ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల రికార్డ్ స్థాయిలో రోజుకి లక్ష కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరోపియన్ దేశాలలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో బ్రిటన్ తదితర దేశాలు పూర్తిస్థాయి లాక్డవున్లతోపాటు.. కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. దీంతో ఇటీవల ఏర్పడిన ఆర్థిక రివకరీ అంచనాలకు షాక్ తగిలింది. తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ట్రేడర్లలో భయాలు వ్యాపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. ఇటీవల జనవరి నుంచి రోజుకి 2 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిని పెంచేందుకు రష్యా, ఒపెక్ దేశాలు ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. చమురు ఉత్పత్తి, కోతల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయి. -
ముడిచమురుకూ కోవిడ్-19 సెగ
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్‌డవున్‌ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఓకే ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కారణాలివీ అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. -
చమురు ధరలకూ అమ్మకాల సెగ
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేయడంతో ప్రపంచ ఆర్థిక పురోగతిపై ఆందోళనలు పెరిగాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువత్తగా.. ముడిచమురు ధరలకూ ఈ సెగ తగిలింది. వెరసి గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 7 శాతం పతనమైంది., 39 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 8 శాతం పడిపోయి 36.4 డాలర్లను తాకింది. దీంతో ఏప్రిల్ తదుపరి తిరిగి ఒకే రోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. బ్రెంట్ బ్యారల్ 1.5 శాతం క్షీణించి 37.97 డాలర్లకు చేరగా.. నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం నీరసించి 35.68 వద్ద ట్రేడవుతోంది. నిల్వల ఎఫెక్ట్ ఈ నెల 5తో ముగిసిన వారంలో వాణిజ్య చమురు నిల్వలు 5.7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చమురు నిల్వలు 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు తెలియజేసింది. తద్వారా చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోనున్న భయాలు ప్రధానంగా చమురు వర్గాలలో ఆందోళనలకు దారితీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇది చమురు డిమాండ్‌ను దెబ్బతీయవచ్చన్న అంచనాలు అమ్మకాలకు కారణమైనట్లు వివరించారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డవున్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి. -
33 పైసలు ఎగిసిన రూపాయి.. మళ్లీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ రూపాయికూడా మంగళవారం భారీగా పుంజుకుంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి 72.50 వద్ద ప్రారంభ మైంది. అనంతరం 33 పైసలు పెరిగి 72.43 కు చేరుకుంది. కానీ ఈ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన రూపాయి 72.64 వద్ద కొనసాగుతోంది. సోమవారం రూపాయి 72.76 ఏడాది కనిష్టం వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ ముడి చమురు ఫ్యూచర్స్ 2.41 శాతం పెరిగి బ్యారెల్‌కు 53.15 డాలర్లకు చేరుకుంది. అయితే బంగారం ధరలు ఫ్యూచర్స్ లో స్వలంగా తగ్గా, వెండి ధరలు పుంజుకున్నాయి. అటు దలాల్ స్ట్రీట్‌లో, ఇటు కరెన్సీ మార్కెట్లో కూడా కరోనావైరస్ ఆందోళన కొనసాగుతోంది. దీంతోపాటు ఢిల్లీలో ఒకటి, తెలంగాణా ఒక పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు నేడు సానుకూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్456పాయింట్లు పెరిగి 38,603 వద్ద, నిఫ్టీ 1590 పాయింట్లు పెరిగి 11,292 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ. 1,354.72 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. కాగా చైనాలో విస్తరించిన కోవిడ్-19 క్రమంగా ప్రపంచదేశాలను చుట్టముడుతోంది. తాజాగా భారతదేశంలో మరో రెండు కరోనా వైరస్ బాధితులను గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. -
స్వల్పంగా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. బుధవారం 2 శాతం క్రూడ్ ధరలు పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం (జూన్ 27) పెట్రోల్, డీజిల్ రిటైల్ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు 7పైసలు, డీజిల్ ధర లీటరుకు 5-6 పైసలు పెరిగాయి. ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర బుధవారం రూ .70.05 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .63.95గా ఉంది. అమరావతి : లీటరు పెట్రోలు రూ. 74. 31 డీజిల్ లీటరు రూ. 69.15 హైదరాబాద్ : లీటరు పెట్రోలు రూ. 74.52 డీజిల్ లీటరు రూ. 69.70 కోలకతా : లీటరు పెట్రోలు రూ. 72.38 డీజిల్ లీటరు రూ. 65.87 చెన్నై: లీటరు పెట్రోలు రూ. 72.84 డీజిల్ లీటరు రూ. 67.64 ముంబై : లీటరు పెట్రోలు రూ. 75.82 డీజిల్ లీటరు రూ. 67.05 మరోవైపు గురువారం అంతర్జాతీయ చమురు మార్కెట్లో, ముడి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. జి20 శిఖరాగ్ర సమావేశం, ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తిదారుల సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు( ఫ్యూచర్స్ )బ్యారెల్‌కు 0.3శాతం క్షీణించి 66.30 డాలర్లుగా ఉంది -
రూపాయికి చమురు సెగ!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బేరల్‌కు 75 డాలర్లు దాటడం... డాలర్ ఇండెక్స్ పరుగు... దీనితో డాలర్ మరింత పెరిగిపోతుందేమోనని చమురు దిగుమతి కంపెనీల ఆందోళన... దీనితో పెద్ద ఎత్తున ఆ దేశం కరెన్సీ కొనుగోళ్లు... వెరసి డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఏకంగా 26పైసలు పడిపోయింది. స్టాక్ మార్కెట్ లాభాలు కూడా రూపాయి బలాన్ని ఇవ్వలేకపోయాయి. రూపాయి విలువ 67 స్థాయిని దాటిపోయి, 67.13 వద్ద ముగిసింది. ఇది 15 నెలల కనిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్ పరుగు... వాణిజ్యలోటు తీవ్రత, క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ అవకాశాల వంటి సందేహాలకు దారితీస్తోందని ఇది రూపాయి పతనానికి కారణమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ పెరిగినా, ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగానే కొనసాగుతుండడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌లో మొత్తం భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.15,500 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
ఆర్థిక వ్యవస్థకు ‘చమురు’ సెగ!
ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టుదాటలేదు. తగిన స్థాయిలోనే కరెంట్ అకౌంట్ లోటు. ఆర్థిక సంస్కరణల పరంపర. వెరసి తగిన వ్యాపార పరిస్థితులు ఉన్న దేశంగా భారత్ స్థానం ఒకేసారి 130 నుంచి 100కు జంప్. తాజాగా మూడీస్ రేటింగ్ పెంపు. ఇవన్నీ మనదేశం ముందున్న సానుకూల అంశాలు. డాలర్ మారకంలో రూపాయి విలువ 63 గరిష్ట స్థాయికి బలపడి, క్రూడ్ ధరలు 45 డాలర్ల కనిష్ట స్థాయిలో ఉండటం నాలుగు నెలలకు ముం దు కేంద్రానికి సంతోషాన్నిచ్చి ఉంటుంది. కానీ, ఆ తర్వాత క్రూడ్ విషయంలో పరిస్థితి తల్లక్రిందులైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగిపోయింది. కొద్ది వారాల క్రితం 64.65 డాలర్ల స్థాయికి ఎగసి, ప్రస్తుతం 63 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇది 2015 నాటి గరిష్ట స్థాయి. ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ సైతం గడిచిన నాలుగు నెలల్లో కొంత బలహీనపడి 65 డాలర్ల ఎగువకు చేరిపోయింది. ఇందుకు కారణాలు ఏమిటన్న అంశాన్ని పక్కడబెడితే, దేశీయంగా ఈ అంశం చూపే ప్రతికూల ప్రభావాలపై ఇప్పుడు ఆర్థిక విశ్లేషకుల్లో భారీ చర్చే మొదలైంది. ఈ సవాళ్లను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన 2018–2019 బడ్జెట్లో ఎలా ఎదుర్కొనగలరన్నది ప్రధానాంశం. ఆందోళన ఎందుకు... భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. ♦ ఎఫ్ఐఐ, డీఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే ఆదాయం మధ్య నికర వ్యత్యాసమే కరెంటు ఖాతా లోటు (క్యాడ్). చమురు దిగుమతుల బిల్లు 28 శాతం పెరగడం, ఎగుమతులు 1.1 శాతం పడిపోవడం వల్ల అక్టోబర్‌లో క్యాడ్ పెరుగడం తొలి హెచ్చరిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 1.5% ఉంటుందని (40 బిలియన్ డాలర్లు) ఒక అంచనా. అయితే చమురు ధరలు ఇదే రీతిన పెరుగుతుంటే... క్యాడ్ మరింత ఆందోళనకర స్థాయికి చేరే వీలుంది. క్యాడ్ పెరిగితే రూపాయి విలువ సైతం మరింత బలహీనపడుతుంది. దిగుమతుల బిల్లును పెంచే అంశమిది. ♦ రెండవ అంశానికొస్తే, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల దేశంలోనూ ధరల పెరుగుదలకు దారితీసే మరో ప్రధాన అంశం. ఇది సామాన్యునిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశాల్లో ఒకటి. ♦ ఇక ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలతో ఇప్పటికే ఆర్బీఐ తాను బ్యాంకులకు ఇచ్చే రుణ రేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం) తగ్గింపునకు మొగ్గుచూపడం లేదు. 4 శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని నిర్వహించలేని పక్షంలో రెపో రేటు తగ్గింపు నిర్ణయాన్ని పూర్తిగా ఆర్బీఐ పక్కనబెట్టే అవకాశం ఉంది. రెపో తగ్గింపుద్వారా డిమాండ్ పెరుగుతుందని, ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కార్పొరేట్లకు ఇది చేదువార్తే. ♦ ధరల కట్టడి కోసమని పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించాల్సిన పరిస్థితి కేంద్రానికి ఉత్పన్నమవుతోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయాలు పడిపోతాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటుకు ఇది ప్రతికూలాంశం. ఇది విధాన నిర్ణేతలకు కఠిన పరీక్షే. అక్టోబర్ 3న ప్రభుత్వం ఈ తరహాలోనే పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2 శాతం. దీనర్థం జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతం దాటకూడదన్నమాట (గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.5%). వచ్చే ఆర్థిక సంవత్సరం దీనిని 3%కి తగ్గించాన్నది ప్రణాళిక. బడ్జెట్లో గణాంకాలు.. సవాళ్లు..! 2018 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో జైట్లీ, ఆయన టీమ్ సమతౌల్యం పాటించాల్సిన అంశాలు, సవాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే... ♦ ప్రస్తుతం బ్రెంట్ 63 డాలర్ల స్థాయిలో ట్రేడవుతుండగా, భారత్‌కు తగిన శ్రేణి 56–60 డాలర్లు. ♦ ఇటీవల రేటు హేతుబద్ధీకరణ తరువాత, జీఎస్టీ ఆదాయంలో నష్టం రూ.20,000 కోట్లు. ♦ ప్రభుత్వ బ్యాంకులకు రెండేళ్లలో రీ–క్యాపిటలైజేషన్కు అవసరమైన నిధులు రూ.2.1 లక్షల కోట్లు. ♦ 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్ధూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనా శ్రేణి 6.75 – 7.5 శాతం కాగా, మొదటి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతంగా నమోదు. ♦ 2017–18లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.72,500 కోట్లు. ఇప్పటి వరకూ వచ్చింది 52,500 కోట్లు. ♦ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఇంకా మందగమనంలోనే. కార్పొరేట్లకు పెరగని ఆదాయాలు. -
11 ఏళ్ల కనిష్టానికి ముడిచమురు
35 డాలర్ల దిగువకు బ్రెంట్ క్రూడ్ ధర లండన్: డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడిచమురు రేట్లు మరింతగా పతనమవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ రేటు తాజాగా 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2004 తర్వాత తొలిసారి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 35 డాలర్ల దిగువకు పతనమై.. 34.83 డాలర్ల స్థాయిని తాకింది. ఆ తర్వాత కొంత కోలుకుంది. మార్కెట్ వాటాను కోల్పోకూడదనే ఉద్దేశంతో సౌదీ అరేబియా, తాజాగా ఇరాన్ మరింత చమురు ఉత్పత్తి చేయనుండటం, అమెరికాలో నిల్వలు గణనీయంగా పెరగొచ్చన్న అంచనాలు క్రూడ్ రేటు పతనానికి దారి తీశాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా అణుపరీక్షలపై భయాలు, బలమైన డాలరు, బలహీనమైన డిమాండ్, గణనీయంగా సరఫరా తదితర అంశాలు క్రూడ్ ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని వారు వివరించారు. -
2015 డిసెంబర్‌కల్లా 9,600కు...
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపై కూడా బుల్ పరుగు కొనసాగిస్తాయని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ తాజాగా అంచనా వేసింది. దీనిలో భాగంగా 2015 డిసెంబర్‌కల్లా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ 9,600 పాయింట్లకు చేరుతుందని పేర్కొంది. ఇప్పటికే నిఫ్టీ 8,350 పాయింట్లనుదాటి కొత్త రికార్డులతో పరుగు తీస్తున్న నేపథ్యంలో యూబీఎస్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కంపెనీల ఫలితాలు, వృద్ధి గణాంకాలు ఇందుకు దోహదపడతాయని యూబీఎస్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోసాగుతున్నదని, దీంతో ప్రస్తుత మార్కెట్ విలువ కొనసాగుతుందని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో 15%, ఆపై ఏడాది(2016-17) 18% చొప్పున కంపెనీల ఆర్జన వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ద్ర వ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్ల తగ్గింపు, విధానాల మద్దతు వంటి అంశాల కారణంగా 2017లో ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి సాధించే అవకాశముందని పేర్కొంది.