11 ఏళ్ల కనిష్టానికి ముడిచమురు
35 డాలర్ల దిగువకు బ్రెంట్ క్రూడ్ ధర
లండన్: డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడిచమురు రేట్లు మరింతగా పతనమవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ రేటు తాజాగా 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2004 తర్వాత తొలిసారి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 35 డాలర్ల దిగువకు పతనమై.. 34.83 డాలర్ల స్థాయిని తాకింది.
ఆ తర్వాత కొంత కోలుకుంది. మార్కెట్ వాటాను కోల్పోకూడదనే ఉద్దేశంతో సౌదీ అరేబియా, తాజాగా ఇరాన్ మరింత చమురు ఉత్పత్తి చేయనుండటం, అమెరికాలో నిల్వలు గణనీయంగా పెరగొచ్చన్న అంచనాలు క్రూడ్ రేటు పతనానికి దారి తీశాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా అణుపరీక్షలపై భయాలు, బలమైన డాలరు, బలహీనమైన డిమాండ్, గణనీయంగా సరఫరా తదితర అంశాలు క్రూడ్ ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని వారు వివరించారు.