న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ మార్కెట్లలో మళ్లీ ముడిచమురు ధరలు మండుతున్నాయి. మంగళవారం దాదాపు 5 శాతం జంప్‌చేసిన ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.2 శాతం పుంజుకుని 50 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.6 శాతం ఎగసి 53.94 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్)
ఏం జరిగిందంటే?
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు మద్దతుగా ఒపెక్‌సహా రష్యావరకూ మూడేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 సంక్షోభం వంటి పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ధరలకు నిలకడను తీసుకువచ్చేందుకు చమురు ఉత్పత్తి, ఎగుమతుల దేశాలు ప్రయత్రిస్తున్నాయి. ఈ బాటలో 2017 జనవరి నుంచి చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా రెండు రోజులపాటు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా అదనపు కోతలకు సిద్ధమని తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్)
రోజుకి 10 లక్షల బ్యారళ్లు
కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment