చమురు ధరలకూ అమ్మకాల సెగ | Crude prices tumbles due to US Inventories | Sakshi
Sakshi News home page

చమురు ధరలకూ అమ్మకాల సెగ

Published Fri, Jun 12 2020 10:06 AM | Last Updated on Fri, Jun 12 2020 10:11 AM

Crude prices tumbles due to US Inventories - Sakshi

పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేయడంతో ప్రపంచ ఆర్థిక పురోగతిపై ఆందోళనలు పెరిగాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువత్తగా.. ముడిచమురు ధరలకూ ఈ సెగ తగిలింది. వెరసి గురువారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 7 శాతం పతనమైంది., 39 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 8 శాతం పడిపోయి 36.4 డాలర్లను తాకింది. దీంతో ఏప్రిల్‌ తదుపరి తిరిగి ఒకే రోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 1.5 శాతం క్షీణించి 37.97 డాలర్లకు చేరగా.. నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 2 శాతం నీరసించి 35.68 వద్ద ట్రేడవుతోంది.

నిల్వల ఎఫెక్ట్‌
ఈ నెల 5తో ముగిసిన వారంలో వాణిజ్య చమురు నిల్వలు 5.7 మిలియన్‌ బ్యారళ్లమేర పెరిగినట్లు యూఎస్‌ ఇంధన ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చమురు నిల్వలు 538 మిలియన్‌ బ్యారళ్లను అధిగమించినట్లు తెలియజేసింది. తద్వారా చమురు నిల్వలు సరికొత్త రికార్డ్‌ గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్‌ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. నిజానికి 1.45 మిలియన్‌ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోనున్న భయాలు ప్రధానంగా చమురు వర్గాలలో ఆందోళనలకు దారితీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్‌-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇది చమురు డిమాండ్‌ను దెబ్బతీయవచ్చన్న అంచనాలు అమ్మకాలకు కారణమైనట్లు వివరించారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్‌ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డవున్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement