సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఫలితంగా అక్టోబర్‌లో నైమెక్స్ చమురు ధరలు నికరంగా 11 శాతం పతనంకాగా.. బ్రెంట్ బ్యారల్ ధరలు సైతం 10 శాతం వెనకడుగు వేశాయి. ఈ బాటలో మరోసారి చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు వెల్తువెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం..
3.5 శాతం డౌన్
గత వారం భారీగా వెనకడుగు వేసిన ముడిచమురు ధరలు మళ్లీ పతన బాట పట్టాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 3.7 శాతం నష్టంతో 34.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3.25 శాతం క్షీణించి 36.72 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి ఐదు నెలల కనిష్టాలకు చేరాయి.
కారణాలివీ
కొద్ది రోజులుగా అమెరికాలో ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల రికార్డ్ స్థాయిలో రోజుకి లక్ష కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరోపియన్ దేశాలలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో బ్రిటన్ తదితర దేశాలు పూర్తిస్థాయి లాక్‌డవున్‌లతోపాటు.. కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. దీంతో ఇటీవల ఏర్పడిన ఆర్థిక రివకరీ అంచనాలకు షాక్ తగిలింది. తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ట్రేడర్లలో భయాలు వ్యాపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
కోతలు కొనసాగవచ్చు
చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. ఇటీవల జనవరి నుంచి రోజుకి 2 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిని పెంచేందుకు రష్యా, ఒపెక్ దేశాలు ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. చమురు ఉత్పత్తి, కోతల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment