
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్‌డవున్‌ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి.
ప్రస్తుతం ఓకే
ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
కారణాలివీ
అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
కోతలు కొనసాగవచ్చు
చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment