లండన్/ న్యూయార్క్: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు సిద్ధంకానున్న వార్తలతో ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం 5 శాతం పురోగమించిన చమురు ధరలు వరుసగా రెండో రోజు బలపడ్డాయి. వెరసి విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టాలకు చేరాయి. ఇటీవలి ఎన్నికలలో అమెరికా ప్రెసిడెంట్‌గా జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా ధృవ పడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు జతగా ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికి కరోనా కట్టిడికి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొనడంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా ముడిచమురు ధరలు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి.
ఒపెక్ ఎఫెక్ట్..
చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో రష్యాసహా ఒపెక్ దేశాలు గత కొద్ది నెలలుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2021 జనవరి వరకూ కోతలు అమలుకానున్నాయి. కాగా.. కోతల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశంకానున్నాయి. దీనిలో భాగంగా జనవరి 2021 తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కనీసం రోజుకి 2 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. అంటే 5.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలు మరో ఆరు నెలలు కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని, దీంతో చమురుకు డిమాండ్ పుంజుకుంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు చమురు ఉత్పత్తిలో కోతలు కొనసాగితే ధరలు మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నాయి.
ధరల జోరు
ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1 శాతం ఎగసి 46.51 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1.1 శాతం పుంజుకుని 43.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. వివిధ పన్నులతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరల సవరణలో ప్రభావం చూపుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment