దేశంలో అనతి కాలంలోనే వటవృక్షంలా ఎదుగుతోంది గిగ్ ఎకానమి. డిగ్రీలు, ఎక్స్‌పీరియన్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇలాంటివేమీ లేకుండానే వెంటనే నేటి తరం యువత గిగ్ ఎకానమీలో జాబ్‌లు పొందుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ మొదలు స్విగ్గీ మీదుగా ర్యాపిడో ఎంతో మంది డెలివరీ ఏజెంట్ అవతారంలోకి ఈజీగా మారిపోతున్నారు. అయితే ఇటీవల ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని నెట్టింట సరికొత్త చర్చకు దారి తీసింది.
ప్రాప్తి అనే నెటిజన్ ఇటీవల స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ ఏజెంట్ ద్వారా ఫుడ్‌ను అందుకుంది. కానీ ఆ తర్వాతే కొత్త సమస్య ఎదురైంది. ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి అవాంచిత మెసేజ్‌లు రావడం మొదలైంది. ‘మీ ప్రవర్త బాగుంది’, ‘మీరు చాలా అందంగా ఉన్నారు’, ‘ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అంటూ వరుసగా మెసేజ్‌లు రావడం మొదలైంది. ఇవి మరీ శృతి మించిపోవడంతో స్విగ్గీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసింది.
ఇదేం బాగాలేదు
ఫిర్యాదు చేసినా స్విగ్గీ నుంచి సరైన స్పందన రాలేదు. మరోవైపు నుంచి డెలివరీ ఏజెంట్ నుంచి మెసేజ్‌ల దాడి కూడా ఎక్కువైంది. దీంతో తాను పడుతున్న ఇబ్బందనులను ట్విటర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిపింది ప్రాప్తి. డెలవరీ ఏజెంట్ ప్రవర్తనను నిరసిస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. అదే విధంగా సున్నితమైన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్విగ్గీ తీరును కూడా ఖండించారు.
క్షమించండి
ఎట్టకేలకు స్విగ్గీ దిగి వచ్చింది. ఈ కంపెనీ తరఫున ప్రతినిధులు ప్రాప్తితో మాట్లాడారు. జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఇబ్బందులకు గురి చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పకబ్బంధీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాస్కింగ్ ఫీచర్
ఈకామర్స్ రంగంలో ఉన్న కంపెనీలు సాధారణంగా కస్టమర్లతో వ్యవహారం నడిపేందుకు మాస్కింగ్ ఫీచర్‌ను ఉపయోగిస్తాయి. ఈ విధానంలో కస్టమర్ నంబర్ డెలివరీ ఏజెంట్‌కి తెలియకుండా జాగ్రత్త పడతాయి. అయితే గట్టిగా ప్రయత్నిస్తే మాస్క్ ఫీచర్‌లో కూడా కస్టమర్ల నంబర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మరింత కట్టుదిట్టంగా టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment