రూ.55 వేలకోట్ల దావూద్‌ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే.. | Dawood Ibrahim Approxmate Business Value | Sakshi
Sakshi News home page

రూ.55 వేలకోట్ల దావూద్‌ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..

Published Mon, Dec 18 2023 5:00 PM | Last Updated on Mon, Dec 18 2023 5:18 PM

Dawood Ibrahim Approxmate Business Value  - Sakshi

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికలపై ఎలాంటి ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.

దావూద్‌ కరాచీలో ఉంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. అతని భార్య జుబీనాజరీన్‌, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డీ-కంపెనీకి అధిపతిగా మారాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు ఈ కింది విధంగా ఉన్నట్లు సమాచారం.

  • చమురు, లూబ్రికెంట్లు: ఒయాసిస్ ఆయిల్ & లూబ్ ఎల్‌సీసీ అనే దుబాయ్ ఆధారిత కంపెనీ చమురు, లూబ్రికెంట్ల వ్యాపారం సాగిస్తోంది. ఇది డీ-కంపెనీల్లో ఒకటిగా ఉన్నట్లు తెలిసింది.
  • డైమండ్స్: అల్-నూర్ డైమండ్స్ అనేది దుబాయ్‌లోని వజ్రాల వ్యాపార సంస్థ. ఇది డి-కంపెనీకి మనీలాండరింగ్‌కు సహకరిస్తుందని గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 
  • పవర్: ఒయాసిస్ పవర్‌ ఎల్‌సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సెక్టార్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది డీ-కంపెనీకి సహకరిస్తుందని నమ్ముతుంటారు.
  • నిర్మాణ రంగం: డాల్ఫిన్ కన్‌స్ట్రక్షన్‌ అనేది నిర్మాణం, రియల్ ఎస్టేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది డీ-కంపెనీకి మద్దతు తెలుపుతుందని కొన్ని కథనాల ద్వారా తెలిసింది.
  • ఎయిర్‌లైన్స్: ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించాడు. ఈ సంస్థను స్మగ్లింగ్, పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసివేశారు. 

ఇవి దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కొన్ని కంపెనీలని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి నిర్థారణలు లేవు. దావూద్‌ పాకిస్థాన్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కొందరు చెబుతుంటారు. అతను హవాలా మనీతో ఈ సమ్రాజ్యాన్ని సృష్టించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, గన్‌ సప్లైతో దావూద్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 

ఫోర్బ్స్ ప్రకారం గ్యాంగ్‌స్టర్లలో దావూద్ అధిక ధనవంతుడిగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. 

ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్‌ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్‌ ఇదే..

దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పటికే దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement