న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. తాజాగా రెండు కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో మూడు సంస్థలు లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ ఇష్యూ ఆలోచనకు స్వస్తి పలుకుతున్నట్లు స్టెరిలైట్ పవర్, ముక్కా ప్రొటీన్ పేర్కొనడం గమనార్హం. వివరాలు చూద్దాం..
డెల్టాటెక్ రెడీ
రియల్ మనీ గేమింగ్ విభాగంలో తొలి దశలోనే కార్యకలాపాలు విస్తరించిన డెల్టాటెక్ గేమింగ్‌కు తాజాగా సెబీ నుంచి అనుమతి లభించింది. మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ డెల్టా కార్ప్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లను బిజినెస్ విస్తరణకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేటాయించనుంది.
ప్రిస్టీన్.. సై
ప్రధానంగా రైల్ రవాణా నెట్‌వర్క్‌కు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయ సర్వీసులందించే ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిస్టింగ్ కోసం జూన్‌లో సెబీని ఆశ్రయించింది. తాజాగా ఇందుకు అనుమతి లభించింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 2 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, కంపెనీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కంటెయినర్, నాన్‌కంటెయినర్ తదితర వివిధ రైల్, రోడ్ రవాణా సంబంధ వివిధ సర్వీసులు అందిస్తోంది.
ఎయిరాక్స్ టెక్నాలజీస్
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ ఎయిరాక్స్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రమోటర్లు సంజయ్ భరత్‌కుమార్ జైస్వాల్(రూ. 525 కోట్లు), ఆషిమా సంజయ్ జైస్వాల్(రూ. 225 కోట్లు) విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ప్రధానంగా పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేటర్లను తయారు చేస్తోంది. ప్రయివేటరంగ పీఎస్‌ఏ మెడికల్ ఆక్సిజన్ మార్కెట్లో కంపెనీ 50–55 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022 మార్చికల్లా దేశీయంగా దాదాపు 872 స్థాపిత పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేటర్లు నిర్వహణలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
లోహియా కార్ప్
టెక్నికల్ టెక్స్‌టైల్స్ తయారీకి అనువైన మెషీనరీ, విడిభాగాలు రూపొందించే కాన్పూర్ కంపెనీ.. లోహియా కార్ప్ ఐపీవో చేపట్టేందుకు సెబీని ఆశ్రయించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, శాక్స్ తయారు చేసేందుకు వీలైన మెషీనరీని ప్రధానంగా రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 2,000 మంది కస్టమర్ల బేస్‌ను కలిగి ఉంది. గతేడాది(2021–22)లో ఆదాయం రూ. 1,334 కోట్ల నుంచి రూ. 2,237 కోట్లకు జంప్ చేసింది. నికర లాభం రూ. 119 కోట్ల నుంచి రూ. 161 కోట్లకు ఎగసింది.
ఐకియో ఐపీవోకు
లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందించే ఐకియో లైటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 237 కోట్లు సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్‌కు, కొత్త యూని ట్ ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. కంపెనీ నాలుగు తయారీ యూనిట్లను కలిగి ఉంది.
స్టెరిలైట్ పవర్
గతేడాది(2021) ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన ప్రయివేట్ రంగ కంపెనీ స్టెరిలైట్ పవర్ సందిగ్ధంలో పడింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ ప్రస్తుత ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇష్యూ చేపట్టడం సరికాదని భావిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఐపీవోను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్లు విద్యుత్ ప్రసారం, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ తాజాగా వెల్లడించింది. వెరసి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలియజేసింది. అయితే మార్కెట్లు కుదురుకుంటే భవిష్యత్‌లో సెబీకి తిరిగి ప్రాథమిక పత్రాలను దాఖలు చేయనున్నట్లు వివరించింది.
ముక్కా ప్రొటీన్
ఈ ఏడాది మార్చిలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ముక్కా ప్రొటీన్ వెనకడుగు వేసింది. తాజాగా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. చేపల ఆహారం, చేప నూనె, ఆక్వా, పౌల్ట్రీ రంగాలలో ఫీడ్‌గా వినియోగించే ఫిష్ సొల్యూబ్ పేస్ట్ తదితరాలను కంపెనీ ప్రధానంగా తయారు చేస్తోంది. సబ్బుల తయారీ, లెదర్, పెయింట్ల పరిశ్రమల్లోనూ కంపెనీ ప్రొడక్టులను ఉపయోగిస్తారు.
మళ్లీ ఐపీవోల దూకుడు
Published Tue, Oct 4 2022 6:21 AM | Last Updated on Tue, Oct 4 2022 6:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment