న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.
రూ. 5,500 కోట్లకు రెడీ
ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్‌అండ్‌డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్‌క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281
ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment