
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ మార్కెట్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల హవా నడుస్తోంది. 2020–21లో దేశవ్యాప్తంగా మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 66 శాతముందని అనరాక్ నివేదిక వెల్లడించింది. అలాగే ఆఫీస్ అద్దె పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. ‘ఆఫీస్ స్పేస్ సరఫరా, నికరంగా కంపెనీలు స్థలం తీసుకోవడం, అద్దె పెరుగుదలలో ఈ దక్షిణాది నగరాలు ఇతర ప్రాంతాలను దాటాయి.
పశ్చిమ, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి చెందిన ఈ మూడు నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల నుంచి భారీ డిమాండ్, అందుబాటు ధరలో అద్దెలు, స్టార్టప్స్‌తోపాటు తయారీ, పారిశ్రామిక రంగాలు ఆఫీస్ స్పేస్ పెరగడానికి కారణం. టాప్–7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల వాటా 2019–20లో 47 శాతం నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు కొత్తగా 2.13 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఇందులో మూడు నగరాల వాటా 1.4 కోట్ల చదరపు అడుగులు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణే 45.6 లక్షల చదరపు అడుగులతో 21 శాతం, జాతీయ రాజధాని ప్రాంతం 23 లక్షల చదరపు అడుగులతో 11 శాతం వాటా కైవసం చేసుకుంది. కార్యాలయాలకు చెల్లించే అద్దె హైదరాబాద్‌లో చదరపు అడుగుకు 2017–18లో రూ.51 ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.57కు చేరింది’ అని అనరాక్ నివేదిక వివరించింది.
చదవండి: ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్
Comments
Please login to add a commentAdd a comment