
సాక్షి, హైదరాబాద్: సాంప్రదాయకంగా భారతీయ కుటుంబాల గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు అంతర్భాగమే. కానీ, ఈమధ్య కాలంలో మహిళలు స్వతంత్ర గృహ కొనుగోలు, పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఈ సంస్కృతి బాగా పెరిగింది. 2019లో గృహ కొనుగోళ్లకు 57% మంది మహిళలు ఆసక్తిని కరబరచగా.. 2020 హెచ్2 నాటికి 62%కి, గతేడాది హెచ్2 నాటికి 64%కి పెరిగింది. ఇంట్లోనే కాదు ఇంటి కొనుగోలు ఎంపికలోనూ మహిళలదే పైచేయి సాధిస్తున్నారు.
రియల్టీ వైపు
బంగారమే కాదు రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి కోణంలో చూసే మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయాలని భావించే మహిళలు 74% ఉండగా.. 26% మంది పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వేలో వెల్లడైంది.
67% రూ.1.5 కోట్ల ధర గృహాలకే..
రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి, ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 67% మహిళలు ఆసక్తిగా ఉన్నారు. ఇందులో 33% మంది రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ధర ఉన్న గృహాలకు, 34% మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్ గృహాలపై దృష్టిసారించారు. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉండే అల్రా లగ్జరీ ప్రాపర్టీ కొనుగోళ్లకు 2020 హెచ్2లో 5 శాతం మహిళలు మొగ్గు చూపించగా.. గతేడాది సర్వే నాటికిది 7 శాతానికి పెరిగింది. 79% మంది మహిళలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో లేదా 6 నెలల్లో పూర్తయ్యే గృహాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. 11 శాతం మంది ఏడాది కంటే ఎక్కువ వ్యవధిలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుండగా.. 10 శాతం మంది కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
3 బీహెచ్‌కే వైపు మొగ్గు..
కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఇంటి అవసరం, విస్తీర్ణాలు రెండూ పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం పెరగడంతో విశాలమైన ఇళ్లు కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. దీనికి మహిళలు ఏమీ మినహాయింపు కాదు. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది మహిళలు 3 బీహెచ్‌కే గృహాల కొనుగోళ్లకు మొగ్గుచూపించారు. 36 శాతం మంది 2 బీహెచ్‌కే, 11 శాతం మంది 4 బీహెచ్‌కే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లను కావాలని కోరుకుంటున్నారు.
చదవండి: ఇంటి యజమానురాళ్లు పెరుగుతున్నారు