టైముకు రాదు.. రీఫండ్‌ చేయరు... వీళ్లతో ఎలా వేగేది ? | DGCA Revealed 2022 February Month Aviation Data | Sakshi
Sakshi News home page

రీఫండ్‌ సరిగా చేయండి సార్‌! ఇలాగయితే ఎలా ?

Published Mon, Mar 21 2022 6:21 PM | Last Updated on Mon, Mar 21 2022 6:52 PM

DGCA Revealed 2022 February Month Aviation Data - Sakshi

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య, రైల్వే బుకింగ్‌లో వెయిటింగ్‌ సమస్య అదే ఎయిర్‌లైన్స్‌ అయితే ప్రయాణికులకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటూ పొరపాటే. ఎర్రబస్సయినా ఎయిర్‌బస్‌ అయినా వాటిలో కామన్‌ పాయింట్‌ కస్టమర్లను ఇబ్బంది పడటం. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ఇదే విషయం చెబుతోంది.

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థ 2022 ఫిబ్రవరికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇందులో గతేడాదితో పాటు గత నెలతో పోల్చుతూ ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఏవియేషన్‌ సెక్టార్‌ ఎలా చెబుతూ పలు గణాంకాలు ప్రచురించింది. ఇందులో కస్టమర్లు ఏ అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు, విమానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ పలు  వివరాలను ప్రకటించింది.

రీఫండ్‌ ఇబ్బందులు
డీజీసీఏ ప్రకటించిన వివరాల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా విమాన ప్రయాణికులకు కూడా రీఫండ్‌ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. డీజీసీఏకి అందుతున్న ఫిర్యాదుల్లో నూటికి 31 శాతం కేవలం రీఫండ్‌ సమస్య మీదనే వస్తున్నాయి. వాస్తవానికి ఎయిర్‌ ట్రావెల్‌ కస్టమర్లకు వీఐపీ ట్రీట్‌మెంట్‌ లభిస్తుంది. ట్రావెల్‌ ఏజెంట్లు మొదలు టిక్కెట్‌ బుకింగ్‌ యాప్‌లు, విమాన సర్వీసు సంస్థలు బాగానే ట్రీట్‌ చేస్తాయి. కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల విమానం రద్దయినా లేదా టిక్కెట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నా.. వాటికి తాలుకు నగదు ప్రయాణికులకు తిరిగి చెల్లించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. 

మంచి విమానం కావాలి
రీఫండ్‌ కంటే ఎక్కువగా విమాన ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న అంశం విమానం గురించి. ఫ్లైట్‌ చార్జీలు, స్టాఫ్‌ బిహేవియర్‌, లగేజ్‌ లాంటి కీలక అంశాలన్నీ పట్టించుకునే స్థితిలో విమాన ప్రయాణికులు ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన ఫిర్యాదులే విమానం మీద ఉంటున్నాయి. ఆలస్యంగా ప్రయాణించడం మొదలు సీట్లు కంఫర్ట్‌గా లేకపోవడం వరకు 34 శాతం ఫిర్యాదులు విమానాల మీదే ఉంటున్నాయి. 

ఇవే ప్రధానం
రోజురోజుకి విమానయాన రంగం దేశంలో పుంజుకుంటోంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెంచేందుకు ఉదాన్‌లాంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఈ తరుణంలో విమాన ప్రయాణికుల్లో దాదాపు 60 శాతానికిపైగా కేవలం విమానాలు(34 శాతం), రీఫండ్‌(31 శాతం) ఫిర్యాదులు అందుతుండటం శుభపరిణాం కాదని నిపుణులు అంటున్నారు. సర్వీసుల నిర్వాహాణ, నగదు చెల్లింపుల విషయంలో మరింత జాగ్రత్తగా సర్వీస్‌ ప్రొవైడర్లు వ్యవహరించేలా డీజీసీఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆలస్యం ఎందుకంటే?
ఆలస్యం వల్ల అనేక సార్లు ప్రయాణాలు రద్దవుతుంటాయి. ముఖ్యంగా కనెక్టింగ్‌ ఫ్లైట్‌ జర్నీ చేసే వాళ్లకు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర విమానాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రియాక‌్షనరీ 58 శాతం ఉంది. అంటే ఎవరైనా ప్రయాణికులు ఆలస్యం రావడం, కనెక్టింగ్‌ ఫ్లైట్‌ రాకపోవడం ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మన దగ్గర ఏవియేషన్‌ సెక్టార్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇదే తరహా పనితీరు ఉంటే నూట నలభై కోట్ల జనాభాలో కనీసం 20 శాతం మంది విమాన ప్రయాణాలు రెగ్యులర్‌ చేసినా తట్టుకోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement