ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.
‘హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు అనే కస్టమర్ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్‌షిప్ కార్డును వినియోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్ ఆర్డర్ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
సురేష్ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment