దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం.
ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’
ఆర్థిక శాఖ వ్యతిరేకత
దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి.
ఇప్పటికే సబ్సిడీలో కోత
ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment