ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో అధిక పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ఈపీఎఫ్‌వో సభ్యులకు ఊరట లభించింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడవును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడిగించింది. ఇది జూన్ 26తో ముగియాల్సి ఉండగా జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అధిక పింఛన్‌ను ఎంచుకునేందుకు ఈపీఎఫ్‌వో సభ్యులకు గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరోసారి పొడిగించింది. సభ్యులకు మరింత అవకాశం కల్పించేందుకు ఇంతకుముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్ 26 వరకు డెడ్‌లైన్‌ను పొడించుకుంటూ వచ్చింది.
ఎవరు అర్హులు?
2014 సెప్టెంబరు 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పింఛన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబరు 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే.
అవసరమైన పత్రాలు
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పెన్షనర్‌లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీవో), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు అవసరమవుతాయి.
అధిక పెన్షన్‌ను ఎలా లెక్కిస్తారు?
2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 12 నెలలలో కాంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిలో తీసుకున్న సగటు నెలవారీ వేతనం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన, విరమణ చేయబోయే ఉద్యోగులకు, సభ్యత్వం నుండి నిష్క్రమించే తేదీకి ముందు 60 నెలలలో పొందిన సగటు నెలవారీ వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కకడతారు.
Comments
Please login to add a commentAdd a comment