కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్‌పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు.
ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏడాదికి రూ.20.83 లక్షలకు పైన సంపాదించే వారు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి రావొచ్చు. కొత్త రూల్ కేవలం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ద్వారా అర్జించే వడ్డీ మొత్తంపై ఎలాంటి పన్ను విధింపు లేదు. ఇంకా దీనికి సంబందించిన పూర్తీ నియమ, నిబంధనలు ఖరారు చేయలేదు. వీటిపై పన్ను ఎంత విధిస్తారు అనేది త్వరలో తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment