న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) చందాదారులకు శుభవార్త. అటల్ బీమిటీ వ్యాక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును 2022 జూన్ 30 వరకు పోడగిస్తున్నట్లు కార్మికరాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారిని కేంద్ర ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద ఆదుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందేందుకు గతంలో గడువు 2020 డిసెంబర్ 31 వరకు ఉండేది. అయితే, ఆ తర్వాత ఈ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి గడువును ఈసారి ఏకంగా ఒక ఏడాది వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంటే 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద పారిశ్రామిక కార్మికులకు నిరుద్యోగ ప్రయోజనాలు అందిస్తారు. ఏ కారణం చేతనైనా బీమా చేసిన వ్యక్తులు ఉద్యోగం కోల్పోతే 3 నెలల పాటు 50 శాతం వేతనంతో నిరుద్యోగ భత్యం అందిస్తారు. ఈఎస్ఐసీ చట్టం, 1948లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు.(చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం!)
కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెండు అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటైన ఈఎస్‌ఐసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "ఉద్యోగాలు కోల్పోయే ఈఎస్‌ఐసీ చందాదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కోవిడ్-19 మహమ్మారి కాలంలో తొలగిస్తున్న కార్మికుల సంఖ్య పారదర్శకంగా ఉండటం లేదని" అని ఈఎస్‌ఐసీ బోర్డు సభ్యుడు అమర్జీత్ కౌర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment