నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే! | Expectations On Upcoming Union Budget | Sakshi
Sakshi News home page

నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే!

Published Mon, Jan 31 2022 8:37 AM | Last Updated on Mon, Jan 31 2022 3:14 PM

Expectations On Upcoming Union Budget - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒకవైపు ప్రజాకర్షక పథకాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు ఆర్థిక క్రమశిక్షణను ఏ విధంగా పాటిస్తారన్న ఆసక్తి నెలకొంది. వ్యాపార వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై కార్పొరేట్‌ వర్గాలు, చేతిలో కాస్తయినా మిగిలేలా పన్ను చట్టాలను సవరిస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే క్రిప్టో కరెన్సీల మీద పన్నులపై స్పష్టతనిస్తారేమోనని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఉపాధి, ఆదాయం, డిమాండ్‌ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నాంగియా ఆండర్సన్‌ ఇండియా చైర్మన్‌ రాకేష్‌ నాంగియా అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణంపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల చేతిలో కాస్త మిగిలేలా బడ్జెట్‌ ఉండాలని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ గోకుల్‌ చౌదరి పేర్కొన్నారు. పన్ను విధానాల్లో స్థిరత్వం కావాలని బడా కార్పొరేట్లు, వ్యాపార వృద్ధికి నిధుల లభ్యత ఉండాలని చిన్న .. మధ్య తరహా సంస్థలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వ్యాపార పరిస్థితులు ఉండాలని విదేశీ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ తెలిపారు.  దేశాన్ని తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే .. దానికి అనుగుణంగా కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నాంగియా ఆండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ సమీర్‌ కపాడియా చెప్పారు. అటు హెల్త్‌కేర్‌ పరిశ్రమ వర్గాలు తమకు ప్రాధాన్య హోదానివ్వాలని కోరుతున్నాయి. రాబోయే బడ్జెట్‌లో ఈ విభాగంపై వ్యయాలను జీడీపీలో కనీసం 3 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నాయి. అలాగే, పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చిన్న పట్టణాల్లో వైద్య సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు.. సిబ్బందికి నైపుణ్యల్లో శిక్షణ కల్పించేందుకు బడ్జెట్‌లో తగు చర్యలు ఉండాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై వివిధ వర్గాల అంచనాల్లో మరికొన్ని .. 

ప్రత్యక్ష పన్నులపరంగా.. 
- ఏడాదికి రూ. 1.5 లక్షలుగా ఉన్న సెక్షన్‌ 80సీ డిడక్షన్‌ను గణనీయంగా పెంచడం.  
- క్రిప్టో అసెట్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. దీంతో వీటిని పన్ను పరిధిలోకి తెస్తూ ప్రత్యేక చట్టాలను రూపొందించడం. 
- దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) .. ఇన్వెస్టర్లకు భారంగా మారింది. పలు ప్రధాన ఎకానమీల్లో ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ లేదు. దేశీయంగా కూడా భారత్‌లో లిస్టయిన షేర్ల విక్రయానికి దీన్నుంచి మినహాయింపునిస్తే స్టాక్‌ ఎక్సేంజీల ద్వారా పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  
- కోవిడ్‌–19 వ్యవధిలో సామాజికంగా, ఉద్యోగుల సంక్షేమం కోసం చేసిన వ్యయాలను డిడక్షన్స్‌ పరిధిలోకి చేర్చాలని కార్పొరేట్‌ వర్గాలు కోరుతున్నాయి. అలాగే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా వెచ్చిస్తున్న కంపెనీలపై పన్ను భారాన్ని తగ్గిస్తారని 
ఆశిస్తున్నాయి. 

పరోక్ష పన్నులపరంగా..
- ఎలక్ట్రిక్‌ వాహనాలు, విడిభాగాలు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి పరికరాలు, సంబంధిత పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీని క్రమబద్ధీకరించడం.  
- సెమీ కండక్టర్ల తయారీకి, ఎగుమతులకు ఊతమిచ్చేలా రంగాలవారీగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం.  
- లెదర్, ల్యామినేట్స్‌ వంటి విభాగాలను కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం పరిధిలోకి చేర్చడం. గత బడ్జెట్‌లలో అంతగా దృష్టి పెట్టని రంగాలకు కూడా అదనంగా ప్రోత్సాహక పథకాలు ప్రకటించడం ద్వారా ఆయా విభాగాల్లోని కంపెనీలు మరింతగా తయారీ కార్యకలాపాలు చేపట్టేలా 
ప్రోత్సహించడం.  
- టెస్టింగ్‌ కోసం దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపునివ్వడం, కస్టమ్స్‌ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడం, కస్టమ్స్‌పరంగా పాటించాల్సిన నిబంధనల భారాన్ని తగ్గించడం మొదలైన చర్యలు బడ్జెట్‌లో ఉండాలని ఆయా వర్గాలు కోరుకుంటున్నాయి.    
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement