స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హై చేరుకున్నాయి. రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు, వచ్చేనెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్నుదారులకు మరింత ఉపశమనం కల్పిస్తారనే వార్తలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఇలా పెరుగుతున్న షేర్ల విలువల మధ్య పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే సందేహం చాలామంది ఇన్వెస్టర్లకు వస్తోంది. మార్కెట్లు ఇంతలా పెరిగాక అనుకోకుండా నష్టాలకు వెళ్లిపోతే ఆందోళన సహజం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు మార్కెట్లు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దాంతో సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. అయితే ఇంతలా పెరిగిన ష్లేర్ల విలువ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవానుకుంటారు. కానీ మన లక్ష్యాలు ఏమిటో ఒకసారి తెలుసుకోవాలి. కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలుంటాయి. మరికొన్ని పదేళ్ల తర్వాత సాధించేవి ఉంటాయి. వివిధ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు తదితరాల ఆధారంగా మన ప్రణాళిక రూపొందించుకోవాలి. స్టాక్ మార్కెట్ పనితీరును కచ్చితంగా అంచనా వేయలేమనే సంగతినీ మర్చిపోవద్దు. నిన్నటి పనితీరు నేడు, నేటి పనితీరు రేపు ఉంటుందన్న హామీ ఇక్కడేమీ ఉండదు. మార్కెట్ గమనం ఎటువైపు సాగుతుందన్న ఆలోచన ఎప్పుడూ సరికాదు. మంచి పెట్టుబడులను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగిస్తే మార్కెట్ ఎప్పుడూ మంచి ఫలితాలనే అందిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఎంపికే కీలకం
గతకొన్ని రోజులుగా మార్కెట్‌లోని లాభాలను చూస్తున్న చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనే మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ మొత్తం పెట్టుబడులను వీటికే కేటాయిస్తున్నారు. మార్కెట్ పనితీరు బాగున్నప్పుడు వీటితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ఒక్కసారి దిద్దుబాటు వస్తే నష్టాలు అధికంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి, పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకునేటప్పుడు, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవాలి.
లక్ష్యాల ఆధారంగా..
స్టాక్ మార్కెట్ పెరుగుతోంది కదా అని ఉన్న పెట్టుబడి మొత్తం అంతా షేర్లలోనే మదుపు చేయడమూ సరికాదు. లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది. మంచి రాబడిని ఆర్జించేందుకూ వీలవుతుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో అందుబాటులో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు.
సమీక్ష ముఖ్యం..
సూచీల్లో వృద్ధి కారణంగా ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. వాటిని ఒకసారి సమీక్షించుకోవాలి. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్, మిడ్ క్యాప్‌లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్ క్యాప్‌లోకి మార్చుకోవచ్చు.
మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment