పెళ్లి అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా మధురానుభూతులను మిగిల్చేలా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఆర్థిక స్థోమత లేకపోయినా ఖర్చుచేసేందుకు వెనుకాడరు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానంగా షాపింగ్ కోసం భారీగా ఖర్చుచేస్తారు. సంపన్న కుటుంబాలైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లిమరీ షాపింగ్ చేస్తుంటాయి. మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నంతలో కాస్త మెరుగైన వస్తువులు ధర ఎక్కువైనా కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ షాపుల్లో ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖర్చులను తెలివిగా ప్లాన్ చేసి తగ్గించుకోవాలి. అందుకోసం నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు.
బడ్జెట్ ప్రణాళిక
షాపింగ్ చేసే ముందు బడ్జెట్ ప్రణాళిక వేసుకోవాలి. పెళ్లి షాపింగ్ ఒక్కటే ఖర్చు కాదు.. అనేక వ్యయాల ఉంటాయి. ప్రతి ఖర్చులోను తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. షాపింగ్ ప్రారంభించే ముందు ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించుకోవాలి. వివిధ వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. అలాగని బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు. బడ్జెట్‌లో వచ్చే వస్తువులను కొనుగోలు చేయాలి. తగిన బడ్జెట్‌ను ముందే సెట్ చేసుకోవడం వల్ల అధిక వ్యయం చేయకుండా ఉంటారు. అవసరమైన కొనుగోళ్లకే ప్రాధాన్యతనిస్తారు.
షాపింగ్ జాబితా..
అవసరమయ్యే వస్తువుల జాబితాను ఇంటి దగ్గరే సిద్ధం చేసుకోవాలి. కొనుగోలు సమయంలో ఆ జాబితాకే కట్టుబడి ఉండాలి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఇది నిరోధిస్తుంది. అంతేకాకుండా, వివాహానికి సరిపడా అన్ని వస్తువులు ఒకేచోట లభించకపోవచ్చు. చాలా చోట్ల షాపింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతిచోటా అనవసర కొనుగోళ్లు చేయకుండా జాబితా ఉపయోగపడుతుంది. చాలామంది రిటైలర్లు వ్యూహాత్మకంగా క్యాష్ / చెక్‌అవుట్ కౌంటర్ల వద్ద ఆకర్షణీయ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. వాటిపై దృష్టి పెట్టకపోవడమే మంచిది. లిస్ట్‌లో రాసుకున్నవాటినే కొనుగోలు చేయడం వల్ల మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
పోలిక మంచిదే
వస్తువులను చూసిన మొదటి షాప్‌లోనే కొనుగోలు చేయనక్కర్లలేదు. నాణ్యతగల వస్తువును, సరైన ధరకు పొందుతున్నారని నిర్ధరించుకోవడానికి వివిధ రిటైలర్లు, ఆన్‌లైన్ స్టోర్స్ ధరలతో సరిపోల్చండి. కొన్ని పేరున్న దుకాణాల్లో, ఆన్‌లైన్ రిటైలర్స్ వద్ద కొన్ని రోజులలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్స్ మరింతగా ఉండొచ్చు.
ఉదయంపూట షాపింగ్
మార్నింగ్ షాపింగ్ చేయడం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి, దుకాణదారులు ఎక్కువ ఐటెమ్స్‌ను విసుగు లేకుండా చూపిస్తారు. బేరమాడడానికి అవకాశముంటుంది. కొన్ని దుకాణాలలో ఎక్కువ జనాదరణ పొందిన వస్తువులు త్వరగా అయిపోతాయి. ఉదయం వెళ్లడం వల్ల వాటిని పొందొచ్చు.
నగదు చెల్లిస్తే మేలు
షాపింగ్ సమయంలో డెబిట్ / క్రెడిట్ కార్డులను, యూపీఐను ఉపయోగిస్తుంటారు. మీ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా కొనుగోలు చేయగలిగిన వాటిని మాత్రమే డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయాలి. జేబులో నగదును ఇచ్చేటప్పుడు ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచిస్తాం! దీనివల్ల కొంతవరకు ఆదా చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరెంతో తెలుసా..
క్రెడిట్ కార్డులు
కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. చాలా క్రెడిట్ కార్డులు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. కొన్ని సీజన్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్స్‌ను పొందగలరో లేదో తెలుసుకోవడానికి మీ కార్డ్ నిబంధనలు, షరతులను చెక్ చేయండి. డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో ఖర్చులు చేసేటప్పుడు ఈ పాయింట్లు ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment