హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సాధ్యాసాధ్యాలు, న్యాయమైన వ్యాపార విధానం విషయంలో వాహన తయారీదారుల నుండి డీలర్లు అధిక పారదర్శకతను ఆశిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది.
కంపెనీల విధాన రూపకల్పనలో డీలర్లనూ భాగస్వాములను చేయాలని ఫెడరేషన్ ప్రధానంగా ఆశిస్తోంది. ద్విచక్ర వాహనాల విషయంలో మిగిలిపోయిన సరుకు, అమ్మకాలపై మార్జిన్స్ పట్ల డీలర్లు ఆందోళనగా ఉన్నారు.
వ్యాపారంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నందున తయారీ సంస్థలు దీనిపై దృష్టిసారించాలని పరిశ్రమ కోరుతోంది. ఉత్పత్తి విశ్వసనీయత, కస్టమర్లకు అందించే మోడళ్లతో డీలర్లు సంతోషంగా ఉన్నారు. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో విడిభాగాల డెలివరీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు, డెలివరీ, విక్రయానంతర సేవల్లో తయారీ కంపెనీల శ్రమను స్వాగతిస్తున్నట్టు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు.
కియా ఇండియా అగ్రస్థానం..
డీలర్ల సంతృప్తిపై 2022 అధ్యయనాన్ని ఫెడరేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం అత్యంత సంతృప్తి చెందిన డీలర్ల జాబితాలో కార్ల విభాగంలో కియా ఇండియా అగ్రస్థానంలో ఉంది. హ్యుండై మోటార్ ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా వరుసగా ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.
వాహన తయారీ దగ్గజం మారుతీ సుజుకీ ఎనమిదవ స్థానంలో నిలిచింది. టూ వీలర్స్ విభాగంలో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వరుసగా మూడు స్థానాలను చేజిక్కించుకున్నాయి. వాణిజ్య వాహన విభాగంలో వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ తొలి స్థానంలో ఉంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment