రాబోయే పండుగ సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. కస్టమర్ల నుంచి అంచనాలను మించి డిమాండ్ ఉంటుందనే లెక్కలతో కంపెనీలు తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు)లను పొలోమంటూ నియమించుకుంటున్నాయి. దీంతో గిగ్ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుందనేది హైరింగ్ ఏజెన్సీల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్
పండుగల పుణ్యామా అని తాత్కాలిక హైరింగ్ జోరందుకుంటోంది. పరిశ్రమలవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అంచనా. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఇది 15–20 శాతం అధికం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం.. స్టాక్ మార్కెట్లు కూడా మాంచి జోరుమీదుండటంతో వినియోగదారులు పండుగల్లో ఈసారి కొనుగోళ్లకు క్యూ కడతారని కంపెనీలు భావిస్తున్నాయి.
పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ కూడా దన్నుగా నిలుస్తుందని లెక్కలేస్తున్నాయి. వెరసి పండుగ అమ్మకాల కోసం కీలక పరిశ్రమలు తాత్కాలిక కొలువులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, సీఈఐఎల్, హెచ్‌ఆర్ సరీ్వసెస్, టీమ్‌లీజ్ సరీ్వసెస్ తదితర హైరింగ్ సంస్థలు చెబుతున్నాయి.
ఈ రంగాల్లో జోష్...
రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్లు వేస్తున్నాయి. ఫుల్ డిమాండ్ ఉంటుందనన్న అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్‌కు గేట్లెత్తాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, కన్జూమర్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్, తయారీ, పర్యాటకం–ఆతిథ్య రంగాలు కూడా పటిష్టమైన డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయి. ‘పండుగ హైరింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, మండుటెండల ప్రభావంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో, పండుగల్లో దండిగానే ఖర్చు చేసే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల్లోనూ కలిపి 6 లక్షల నుంచి 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నాం’ అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్/గూడ్స్ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పండుగ షాపింగ్‌కు కొత్త కళ తీసుకొస్తున్నాయి. మరోపక్క, బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా మరింత వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలనేది వాటి ప్లాన్. దేశంలోని చాలా కంపెనీల వార్షిక వ్యాపారంలో మూడింట రెండొంతులు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యే జరుగుతుందని అంచనా.
చిన్న నగరాల్లో మరింత అధికం
పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం, మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్కృతి విస్తరిస్తుండటం.. వినియోగదారుల ఖర్చు కూడా పుంజుకోవడంతో చిన్న నగరాల్లో కూడా గిగ్ వర్కర్లకు మరింత డిమాండ్ జోరందుకుంది. ‘ముఖ్యంగా గౌహతి, బరోడా, జామ్‌నగర్, వైజాగ్, కటక్, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, భువనేశ్వర్, భోపాల్, లూధియానా, చండీగఢ్ వంటి పలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు తాత్కాలిక ఉద్యోగులకు హాట్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇక్కడ గిగ్ వర్కర్ల డిమాండ్‌లో 25–30 శాతం వృద్ధి కనిపిస్తోంది.
పికర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్ల వెంటపడుతున్నాయి కంపెనీలు’ అని హైరింగ్ సంస్థ అడెకో డైరెక్టర్ మను సైగల్ పేర్కొన్నారు. పండుగల్లో ఆఫర్ల జోరు నేపథ్యంలో ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన డెలివరీ సిబ్బంది, కస్టమర్ సరీ్వస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్‌ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment