ముంబై: కస్టమర్లు తమ నామినీలను నమోదు చేసేలా, నామినీలను అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్‌లు, ఆర్థిక సేవల సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. దీంతో భవిష్యత్తులో నిధుల క్లెయిమ్ సమస్య ఏర్పడబోదన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్)లో భాగంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగమైన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించే విషయమై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. కస్టమర్లు తమ వారసులను నామినీలుగా నమోదు చేసి, వారి పేరు, చిరునామా ఇచ్చేలా చూడాలి’’ మంత్రి పేర్కొన్నారు.
ఒక నివేదిక ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలోనే క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.35,000 కోట్ల మేర ఉంది. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థలో ఇలా క్లెయిమ్ చేయని మొత్తం రూ.లక్ష కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రజలు తాము క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు తెలుసుకుని, వాటిని పొందేందుకు వీలుగా ఆర్‌బీఐ ఆగస్ట్ 17న యూడీజీఏఎం పేరుతో ఓ కేంద్రీకృత పోర్టల్‌ను తీసుకొచ్చింది. వివిధ బ్యాంకుల పరిధిలో అన్‌క్లెయిమ్Šడ్ డిపాజిట్ల వివరాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కలగడం గమనార్హం. బాధ్యతాయుతమైన ఆర్థిక ఎకోసిస్టమ్‌ను నిర్మించడం తప్పనిసరిగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. పన్నుల స్వర్గధామాలు, నిధులను రౌండ్ టిప్ చేయడం బాధ్యాయత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా అభివర్ణించారు. (పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!)
దాడుల ముప్పు..
‘‘భౌతిక సరిహద్దు ముప్పులు ఉన్నాయి. ఇవి సంప్రదాయ యుద్ధ తరహావి. ఇక సైబర్ దాడుల్లో తీవ్రత, ఊహించలేనంత నష్టం ఉంటుంది. ఫైర్‌వాల్స్‌ను ఎంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నా, కొత్త కొత్త మార్గాల్లో దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. క్రిప్టోలు అనేవి ముప్పు మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. ఈ విషయంలో తక్షణ అంతర్జాతీయ సహకారం అవసరం’’అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు.
సంఘటిత ఆర్థిక వ్యవస్థ
‘‘రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ సిప్‌లు రిజిస్టర్ అవుతున్నాయి. ఇవి దీర్ఘకాలంలో సంపద సృష్టికి వీలు కలి్పంచేవి. నెలవారీ సిప్ పెట్టుబడులు జూలై నెలలో రూ.15,245 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు గత దశాబ్ద కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి. 2014 మే నాటికి ఉన్న రూ.10 లక్షల కోట్ల నుంచి 2023 జూలై నాటికి రూ.46.37 లక్షల కోట్లకు పెరిగాయి’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. ఆదాయపన్ను రిటర్నుల సంఖ్య పెరుగుతుండడంపై స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతోందన్నారు. రుణ సదుపాయాలు, సామాజిక భద్రత, పెన్షన్, ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తోందన్నారు. ఫిన్‌టెక్ సంస్థలు బలమైన రక్షణ వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి సూచించారు. యూజర్ల డేటా, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని గోప్యతను కాపాడేందుకు అత్యాధునిక ఎన్‌క్రిప్షన్‌ను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment