FM Sitharaman asks banks: కస్టమర్లతో స్నేహపూరితంగా వ్యవహరించాలని బ్యాంకులకు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. దానివల్ల బ్యాంకు నుంచి రుణం తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగుతుందన్నారు. అదే సమయంలో రుణాల విషయంలో రిస్క్ పట్ల జాగ్రత్తగానూ వ్యవహరించాలని సూచించారు. అండర్‌రైటింగ్ ప్రమాణాల (రుణం జారీ చేసే ముందు రిస్క్ స్థాయిని గుర్తించడం) విషయంలో బ్యాంకులు అలసత్వంగా ఉండరాదని మంత్రి హెచ్చరించారు. బడ్జెట్ అనంతరం పరిశ్రమల ప్రతినిధులతో సోమవారం ముంబైలో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఆరి్థక వ్యవస్థ నిలకడగా కోలుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థపై ఎన్నో అంచల ప్రభావం చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో బాధిత వర్గాలకు చెల్లింపులు చేసేందుకు టెక్నాలజీ ఎంతో సాయపడినట్టు తెలిపారు. ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి మద్దతు కొనసాగుతుందన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ల పట్ల నమ్మకం, విశ్వాసం అన్నది మరింత మంది ఇన్వెస్టర్లను చేరుకోవడానికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ రంగం మరింత బలోపేతం అయ్యే మార్గాలపై దృష్టి సారించాలని ఈ రంగానికి చెందిన భాగస్వాములకు ఆమె సూచించారు.
సంస్థలను అవమానించడమే
జీఎస్‌టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. దేశ సంస్థలను అవమానించడంగా ప్రతిపక్షాల తీరును పేర్కొన్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిల్‌పై మూడింట ఒక వంతు ప్రభావమే కేంద్రం నుంచి ఉంటుందన్నారు.
ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత
ఆరోగ్య సంరక్షణ అన్నది రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత అని ఆరి్థక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా, జీడీపీలో 1.3 శాతంగానే ఉన్నాయని, దీన్ని పెంచాలంటూ వచ్చిన సూచనల పట్ల ఆయన స్పందించారు. కేటాయింపులు అధికం చేయాలంటే జీడీపీలో పన్నుల నిష్పత్తి పెరగాల్సి ఉంటుందన్నారు.
మహిళలు ముందుకు రావాలి..
మహిళలు కంపెనీ బోర్డుల్లో చేరేందుకు వెనకాడుతున్నట్టు, తాను స్వయంగా వారిని ఒప్పించేందుకు ఇబ్బంది పడినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. టాప్ 1,000 కంపెనీలు బోర్డుల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను అయినా కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘నా స్థాయిలో నేను నా వంతు ప్రయత్నాలు చేశాను. ‘కంపెనీ బోర్డుల్లో ఎందుకు చేరడం లేదు? మీ అనుభవం మాకు తోడవ్వాలని కోరుకుంటున్నాం’ అని చెప్పాను. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఇది తీవ్రమైన అంశం’’ అని మంత్రి పేర్కొన్నారు. దీనికి పరిష్కారంతో ముందుకు రావాలని పరిశ్రమను కోరారు.
పూర్తి స్థాయిలో డిజిటల్ సేవలు: ఖరా
ఇదే కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా మాట్లాడుతూ.. డిజిటల్‌గా రుణాలను మంజూరు చేయడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. దీనివల్ల కస్టమర్లు సౌకర్యవంతంగా రుణాలను పొందగలరన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎస్‌బీఐ పూర్తిస్థాయిలో డిజిటల్‌గా రుణాల మంజూరును అమలు చేయనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌ల సమస్యలు ఎక్కువగా మూలధనం వైపు నుంచే ఉన్నట్టు చెప్పారు. ఈ విషయంలో మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. కొంత కాలానికి చిన్న వ్యాపారాలకు ఇచ్చే రుణాలు వ్యక్తిగత రుణాలను అధిగమిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడాల్సి ఉందంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో వసూలు కాని రుణాలను గుర్తించే విషయమై ఆరి్థక మంత్రిని కొన్ని వెసులుబాట్లు కోరనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment