ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయెల్‌లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్‌కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.
కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్‌లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment