న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు విధించడం అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఆంక్షల కారణంగా విమన సర్వీసులు, కార్యాలయాలకు రవాణా తగ్గడం తెలిసిందే. డీజిల్ విక్రయాలు 2.47 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2021 జనవరి 1–15 నాటి అమ్మకాలతో పోలిస్తే 5 శాతం తక్కువగాను, 2021 డిసెంబర్ నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోలిస్తే 14.1 శాతం తగ్గాయి. దేశ ఇంధన వినియోగంలో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటుంది. డీజిల్ వినియోగం పారిశ్రామిక కార్యకలాపాలను కూడా ప్రతిఫలిస్తుంది.
2020 జనవరి నెల మొత్తంమీద డీజిల్ అమ్మకాలు 8 శాతం తగ్గడం గమనార్హం. ఇక పెట్రోల్ విక్రయాలు ఈ ఏడాది జనవరి 1–15 వరకు 9,64,380 టన్నులుగా ఉన్నాయి. 2021 డిసెంబర్ నెల మొదటి పక్షం రోజుల విక్రయాలతో పోలిస్తే 13.81 శాతం తక్కువగాను, 2021 జనవరి నెల మొదటి 15 రోజులతో పోలిస్తే 3 శాతం తగ్గాయి. 2020 జనవరి నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోల్చి చూస్తే మాత్రం 6 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ విక్రయాలు 13 శాతం తగ్గి 2,08,980 టన్నులుగా ఉన్నాయి. ఎల్‌పీజీ విక్రయాలు 5 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment