న్యూఢిల్లీ: ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ వినియోగం తిరిగి గణనీయంగా పెరుగుతోంది. కరోనా పూర్వ స్థాయికి మించి నమోదవుతోంది. మార్చి నెలలో ఇంధనాలకు డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2 శాతం పెరిగి 19.41 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2019 మార్చితో పోలిస్తే ఇది గరిష్ట స్థాయి. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో మార్చిలో ఇంధనాలకు డిమాండ్ కూడా మెరుగుపడింది.
పెట్రోలియం ఉత్పత్తులు అన్నింటిలోకెల్లా అత్యధికంగా వినియోగించే (దాదాపు 40 శాతం) డీజిల్‌కు డిమాండ్ 6.7 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ అమ్మకాలు కొద్ది నెలల క్రితమే కోవిడ్ పూర్వ స్థాయిని దాటాయి. వీటి విక్రయాలు మార్చిలో 6.1 శాతం పెరిగి 2.91 మిలియన్ టన్నులకు చేరాయి.
వ్యవసాయంతో డీజిల్‌కు డిమాండ్..
వ్యవసాయ రంగంలోడిమాండ్ నెలకొనడంతో పాటు ధరలు పెంచుతారన్న అంచనాలతో వినియోగదారులు, పెట్రోల్ బంకులు కూడా నిల్వ చేసుకోవడంతో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇక, వంట గ్యాస్‌కు డిమాండ్ 9.8 శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది. వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఇంధనాలకు డిమాండ్ 4.3 శాతం పెరిగి 202.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇంధనాలకు ఈ స్థాయి డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమం. ఆటోమొబైల్, వంట గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ పారిశ్రామికంగా డిమాండ్ క్షీణించింది.
2021–22లో పెట్రోల్ వినియోగం 10.3 శాతం పెరిగి 30.85 మిలియన్ టన్నులకు, డీజిల్ అమ్మకాలు 5.4 శాతం పెరిగి 76.7 మిలియన్ టన్నులకు చేరాయి. ద్రవీకృత వంట గ్యాస్ వినియోగం 3 శాతం పెరిగి 28.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. విమాన ఇంధనానికి (ఏటీఎఫ్) డిమాండ్ 35 శాతం పెరిగి 5 మిలియన్ టన్నులకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వ స్థాయి 8 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment