హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటా కొత్త లగ్జరీ కార్లు సుమారు 30,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. కొత్త వాటితో పోలిస్తే పాత (సెకండ్ హ్యాండ్) లగ్జరీ కార్లు ఏకంగా రెండింతలు చేతులు మారుతున్నాయట. దీనికంతటికీ కారణం కస్టమర్లు తక్కువ ధరలో లగ్జరీని కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కారు కంటే మెరుగైన మోడల్, ఖర్చు చేసిన దానికంటే విలువైనది కోరుకోవడం, ఉన్నతంగా ఉండాలన్న ఆకాంక్ష.. వెరసి ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారుకు సై అంటున్నారట. తొలిసారిగా కొత్త లగ్జరీ కారు కొనే ముందు పాతదాన్ని సొంతం చేసుకుంటున్నవారు ఎక్కువేనని కంపెనీలు చెబుతున్నాయి. ప్రీ-ఓన్డ్ కార్లకు రిపేర్లు చేసి నాణ్యత ధ్రువీకరణ, వారంటీతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడంతో వినియోగదార్లలో వీటిపట్ల ఆసక్తి పెరిగింది.
రెండు మూడేళ్లకే మారుస్తున్నారు..
లగ్జరీ కార్ల యజమానులు ఎక్కువ మంది రెండు మూడేళ్లకే వాహనాన్ని మారుస్తున్నారట. ఆరు నెలలు కూడా ఉపయోగించకుండానే కారును అమ్మేసి మరో కొత్త మోడల్ స్టీరింగ్ తిప్పే కస్టమర్లూ ఉన్నారు. లగ్జరీ కారు సొంతం చేసుకోవడం గతంలో ఒక కల. ఇప్పుడు విరివిగా ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. పైగా నాలుగేళ్లకే ధర సగానికి వచ్చి చేరుతోంది. ఇక లంబోర్గిని కొత్తది కావాలంటే కనీసం రూ.4 కోట్లు ఖర్చు చేయాలి. పదేళ్ల ప్రీ-ఓన్డ్ కారైతే రూ.50 లక్షలకే దొరుకుతోందని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూ.5 లక్షల నుంచి పాత లగ్జరీ కార్లు లభిస్తాయని చెప్పారు. చిన్న కారు ధరలో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారు కొనుక్కోవచ్చని అన్నారు. రూ.10 లక్షల్లో జాగ్వార్, ల్యాండ్ రోవర్ సైతం లభిస్తున్నాయని తెలిపారు.
ఒక్కో కంపెనీ ఒక్కోలా..
బీఎండబ్ల్యూ గతేడాది 6,600 కొత్త కార్లను విక్రయించింది. యూజ్డ్ కార్ల కోసం ఏర్పాటు చేసిన బీఎండబ్ల్యూ ప్రీమియం సెలెక్షన్ ద్వారా 1,600 యూనిట్లు అమ్మింది. ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ప్రీ-ఓన్డ్ కార్లను ఈ షోరూంల ద్వారా విక్రయించింది. బీఎండబ్ల్యూ 3, 5, ఎక్స్1 సిరీస్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. సంస్థ మొత్తం కార్ల అమ్మకాల్లో 25 శాతం ప్రీ–ఓన్డ్ ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ చెబుతోంది. ఈ కంపెనీకి చెందిన సి-క్లాస్, ఈ-క్లాస్ సెడాన్స్ అధికంగా చేతులు మారుతున్నాయి. ఎంట్రీ లెవెల్ కస్టమర్లపై ఫోకస్ చేసేందుకు యూజ్డ్ కార్లు దోహదం చేస్తున్నాయని ఆడి అంటోంది. ప్రతి కారు కనీసం రెండుసార్లు అమ్ముడవ్వాలన్నది కంపెనీ లక్ష్యం. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్, రేంజ్ రోవర్స్, లంబోర్గిని యూరస్, బీఎండబ్ల్యూ ఎక్స్7 హాట్ సెల్లర్స్ అని లగ్జరీ కార్ల రిటైల్‌లో ఉన్న బిగ్ బాయ్ టాయ్జ్ చెబుతోంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment