న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ చైర్మన్, డైరెక్టరు పదవులకు కిశోర్ బియానీ రాజీనామా చేశారు. ‘దురదృష్టకరమైన వ్యాపార పరిస్థితుల ఫలితంగా‘ సంస్థ సీఐఆర్‌పీని ఎదుర్కొనాల్సి వస్తోందంటూ పరిష్కార నిపుణుడికి (ఆర్‌పీ) పంపిన రాజీనామా లేఖలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కంపెనీపై అభిరుచితో తాను సంస్థ వృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డానని, కానీ ప్రస్తుత వాస్తవ పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి వస్తోందని బియానీ పేర్కొన్నారు.
కంపెనీని ఆర్‌పీ తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను తప్పుకున్నప్పటికీ రుణదాతలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. భారత్‌లో ఆధునిక రిటైల్ కు ఆద్యుడిగా బియానీ పేరొందారు. బిగ్ బజార్, ఈజీడే, ఫుడ్‌హాల్ వంటి బ్రాండ్స్ కింద ఒక దశలో 430 నగరాల్లో 1,500 అవుట్‌లెట్స్‌ను ఎఫ్‌ఆర్‌ఎల్ నిర్వహించింది. అయితే, రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో కంపెనీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment