Adani's Wedding: విలాసాలను విడిచి.. విరాళాలను పంచి.. | Gautam Adani Son Wedding Sets Example By Donating Rs 10000 Crore For Social Causes | Sakshi
Sakshi News home page

చెప్పినట్టు సింపుల్‌గానే అదానీ కొడుకు పెళ్లి.. రూ. 10,000 కోట్లు విరాళం

Published Sat, Feb 8 2025 10:17 AM | Last Updated on Sat, Feb 8 2025 11:35 AM

Gautam Adani Son Wedding Sets Example By Donating Rs 10000 Crore For Social Causes

గత నెలలో మహా కుంభమేళాకు వచ్చిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తన కుమారుడి వివాహం "సింపుల్‌గా సాంప్రదాయ పద్ధతిలో" జరుగుతుందని తెలిపారు. విలాసవంతమైన, ఆడంబరమైన వ్యవహారంగా ఉంటుందన్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ చెప్పిన మాటకు కట్టుబడి తన చిన్న కొడుకు జీత్ అదానీ (Jeet Adani) వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. అంతే కాకుండా రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు.

"సేవే సాధన, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ" అన్న తన తత్త్వానికి అనుగుణంగా గౌతమ్‌ అదానీ ఈ విరాళాలు అందిస్తున్నారని ఆయనకు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఆయన విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కుమార్తె దివా..
తన చిన్న కొడుకు వివాహం సందర్భంగా గౌతమ్ అదానీ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన తన కోడలిని "కుమార్తె దివా" అంటూ సంబోధించడం విశేషం. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్‌షిప్‌లోని బెల్వెడెరే క్లబ్‌లో జీత్ అదానీ, వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా వివాహం జరిగింది. గుజరాతీ సాంప్రదాయం ప్రకారం సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, దౌత్యవేత్తలు, అధికారులు, సినీ తారలు వంటి వారెవరూ కనిపించలేదు.

‘దివ్య’మైన సంకల్పం
పెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు.  ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దివా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదానీ ఈ చొరవను ప్రారంభించారు.

మహా కుంభ మేళాలో చెప్పిన మాట
గత జనవరిలో కొడుకుతో కలిసి మహా కుంభ మేళాకు వెళ్లిన సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో మీ కుమారుడి వివాహం "సెలబ్రిటీల మహా కుంభ్" అవుతుందా అని విలేకరులు ప్రశ్నించగా గౌతమ్ అదానీ స్పందించారు. "ఖచ్చితంగా కాదు. మేము కూడా సామాన్యుల మాదిరిగానే. జీత్ గంగమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. అతని వివాహం సింపుల్‌గా, సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది" అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement