కొద్ది రోజులుగా ఆటుపోట్ల మధ్య కదులుతున్న పసిడి, వెండి ధరలు ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో బలహీనంగా కదులుతున్నాయి. అయితే వారాంతాన విదేశీ మార్కెట్లో లాభపడగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో అటూఇటుగా ముగిశాయి. ఇతర వివరాలు చూద్దాం..
నష్టాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 154 క్షీణించి రూ. 51,561 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 223 నష్టంతో రూ. 67,654 వద్ద కదులుతోంది.
కామెక్స్‌లో ఫ్లాట్‌గా
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా బలహీనపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర వెనకడుగుతో 1,961 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం స్వల్పంగా 0.15 శాతం బలపడి 1954 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 0.3 శాతం తక్కువగా 27.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అటూఇటుగా..
ఎంసీఎక్స్‌లో శుక్రవారం బంగారం ధర బలపడగా.. వెండి డీలా పడింది. 10 గ్రాముల పుత్తడి రూ. 262 పుంజుకుని రూ. 51,715 వద్ద ముగిసింది. తొలుత 51,849 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,453 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 265 క్షీణించి రూ. 67,877 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 68,500 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,480 వరకూ వెనకడుగు వేసింది.
వారాంతాన ఇలా..
న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.65 శాతం పుంజుకుని 1,962 డాలర్ల వద్ద నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.35 శాతం లాభపడి 1951 డాలర్ల వద్ద ముగిసింది. వెండి నామమాత్ర వృద్ధితో ఔన్స్ 27.13 డాలర్ల వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment