కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న పుత్తడి, వెండి ధరలు తాజాగా క్షీణ పథం పట్టాయి. అటు విదేశీ మార్కెట్లోనూ, ఇటు దేశీ మార్కెట్లోనూ డెరివేటివ్ విభాగంలో నష్టాలతో ట్రేడవుతున్నాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్, ఎంసీఎక్స్‌లో వెనకడుగులో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం..
నేలచూపు..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 454 క్షీణించి రూ. 51,320 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1061 కోల్పోయి రూ. 67,930 వద్ద కదులుతోంది.
నాలుగో రోజూ
ఎంసీఎక్స్‌లో వరుసగా నాలుగో రోజు గురువారం పుత్తడి బలపడింది. 10 గ్రాములు రూ. 372పెరిగి రూ. 51,774 వద్ద ముగిసింది. తొలుత 51,851 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,242 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 548 ఎగసి రూ. 68,991 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,768 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 68,471 వరకూ క్షీణించింది. కాగా.. పసిడి, వెండి ధరల నాలుగు రోజుల నష్టాలకు సోమవారం చెక్ పడిన విషయం విదితమే.
కామెక్స్‌లో వీక్
న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం బలపడిన బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.69 శాతం క్షీణించి 1,947 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం నీరసించి 1940 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.75 శాతం పతనమై 26.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గురువారం ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు చివర్లో పుంజుకోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment