
దేశ, విదేశీ మార్కెట్లలో వారాంతాన పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గుల మధ్య బలహీనపడ్డాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం..
నేలచూపులో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 84 క్షీణించి రూ. 49,575 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 417 నష్టంతో రూ. 58,610 వద్ద కదులుతోంది.
నష్టాల ముగింపు
ఆటుపోట్ల మధ్య వారాంతాన ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు వెనకడుగు వేశాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 245 క్షీణించి రూ. 49,659 వద్ద ముగిసింది. తొలుత 49,900 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,380 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 602 నష్టపోయి రూ. 59,027 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 59,720 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 57,550 వరకూ నీరసించింది.
ఫ్లాట్‌గా..
న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం హెచ్చుతగ్గుల మధ్య బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర నష్టంతో 1865 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ యథాతథంగా 1863 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.4 శాతం నీరసించి 23.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment